ఈ లాజిక్కులు పోలీసులతో చెప్పరాదా ఆర్జీవీ!

రాంగోపాల్ వర్మ భిన్నమైన ‘వ్యూహం’తో ముందుకు వెళుతున్నారు. పోలీసుల విచారణకు హాజరు కాకుండా.. పరారీలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఎంచక్కా టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఏడాది కిందట పెట్టిన పోస్టులకు సంబంధించి ఇప్పుడు కేసులు నమోదు కావడమే విచిత్రంగా ఉన్నదంటూ ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు తాను పోలీసు, జ్యుడిషియరీ వ్యవస్థలను గౌరవించే వ్యక్తిని అని చెబుతూనే.. మరోవైపు తన మీద కేసులు నమోదు చేయడాన్నే ఆయన తప్పు పడుతున్నారు.

తాను ఏడాది కిందట ముగ్గురు వ్యక్తులపై పోస్టులు పెడితే.. ఇప్పుడు నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు వ్యక్తులకు మనోభావాలు దెబ్బతిన్నాయని.. తాను ఎవరి మీదనైతే పోస్టులు పెట్టానో వారికి ఏమీ కాలేదని రాంగోపాల్ వర్మ వెటకారంగా మాట్లాడుతున్నారు. వాళ్ల మీద పోస్టులు పెడితే.. వీళ్ల మనోభావాలు దెబ్బతినడానికి అసలు నేరాలకు సంబంధించిన సెక్షన్లు ఎలా వర్తిస్తాయో తనకు అర్థం కావడం లేదని వర్మ అంటున్నారు. రాంగోపాల్ వర్మకు అర్థం కాకపోయినంత మాత్రాన చట్టాలను సవరించాల్సిన అవసరం లేదుకదా అనేది ప్రజల మాట.

ఎందుకంటే- హిందువులకు ఆరాధ్యుడైన దేవేడు రాముడి మీద ఎవరైనా అసభ్య పోస్టులు పెడితే.. దాని వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని హిందువులైన వారే కేసులు పెడతారు. రాంగోపాల్ వర్మ వాదనను గమనిస్తే.. స్వయంగా రాముడు వచ్చి కేసు పెడితే తప్ప తాను స్పందించను అని అంటున్నట్టుగా ఉంది.
రాంగోపాల్ వర్మ మీడియా ఇంటర్వ్యూలు, తాజా ట్వీట్లు పోలీసులను రెచ్చగొట్టేలా ఉండడం కూడా గమనార్హం. ఎలాగంటే.. పోలీసులు తనను అరెస్టు చేయడానికి అసలు రానే లేదని ఆయన చాలా డాంబికంగా ప్రకటిస్తున్నారు.

పోలీసులు తనకోసం తమిళనాడు, మహారాష్ట్ర, ఎక్కడెక్కడో వెతుకుతున్నట్టుగా చెప్పుకుంటున్నారని, అలాగని మీడియాలు వార్తలు వస్తున్నాయని.. అవేవీ నిజం కాదని అన్నారు. పోలీసులు ఇప్పటిదాకా తన ‘డెన్’లో అడుగు పెట్టలేకపోయారని రాంగోపాల్ వర్మ అంటుండడం విశేషం. అరెస్టు చేయడానికి వచ్చిన వారే అయితే.. తన ఆఫీసు బయటినుంచి వెళ్లిపోకుండా కనీసం ఆఫీసులోపలకు వచ్చి చూసి ఉంటారు కదా.. అలాంటిది ఇప్పటిదాకా జరగనేలేదు.. అని కూడా రాంగోపాల్ వర్మ అంటున్నారు. అయితే వర్మ తరఫున వేసిన పిటిషన్ గురువారం హైకోర్టులో సోమవారానికి వాయిదా పడడంతో ఆయన అప్పటిదాకా అజ్ఞాతంలోనే ఉంటారని పలువురు భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories