ఇంతకూ రాంగోపాల్ వర్మ ఏం చేస్తున్నారు? ఏం పనులు చేయడంలో ఆయన బిజీగా ఉండి పోలీసులు విచారణకు పిలిస్తే హాజరు కాలేకపోతున్నారు. ఆయన కొత్త సినిమా చేస్తున్నట్టుగా ఇటీవలి కాలంలో ప్రకటన ఏదీ రాలేదు కదా. పొలిటికల్ మాయ సినిమాలు చేయడానికి ప్రస్తుతానికి సీజను కాదు కదా. మరి వర్మ ప్రస్తుతం ఏ షూటింగుల్లో బిజీగా ఉన్నట్టు? రెండు సార్లు పోలీసులను వాయిదా అడిగి.. ఆయన పరారీలో ఉన్నాడని ప్రజలు అనుకునే పరిస్థితిని ఎందుకు సృష్టించుకుంటున్నారు? అనేది ఇప్పుడు ప్రజలకు పెద్ద సందేహం.
వర్మ ఇప్పుడు ఎలాంటి షూటింగుల్లోనూ లేరు. ఏ సినిమాలూ షూటింగులు జరగడం లేదు. నిజానికి ఆయన దర్శకత్వం వహించినట్టుగా కార్డు పడుతూ విడుదలయ్యే చాలా సినిమాలకు ఆయన స్వయంగా దర్శకత్వం వహించి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి అని ఇండస్టీ్ర వర్గాలు చెబుతుంటాయి.
రాంగోపాల్ వర్మ కేవలం ఒక సినిమా ఒప్పుకుంటారు. అది ‘కొండా’ కావొచ్చు. ‘వ్యూహం’ కావొచ్చు. క్యాస్టింగ్ విషయంలో ఆయన టీం చాలా గట్టిగా పనిచేస్తుంది. నిజజీవిత పాత్రలను పోలిన మనుషులను వెతికి పట్టుకుంటారు. స్క్రిప్టు తయారీలో రీసెర్చి పేరుతో ఇతరుల వద్దకు వెళ్లడం వరకు వర్మ స్వయంగా చేస్తారు. ఎందుకంటే ఆయనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారనే భ్రమ అందరికీ కల్పించడం అవసరం కాబట్టి. అంతా రెడీ అయిన తర్వాత.. ఆయన సెట్స్ లో అడుగుపెట్టేది ఎప్పుడో ఒకసారి మాత్రమే. సెట్స్ కు లేదా, లొకేషన్స్ కు వస్తున్నారంటే.. ఆరోజున ఏదో మీడియా వారితో ఒక ఇంటర్వ్యూకూడా ఉంటుందని అనుకోవాలి.
అసిస్టెంట్లే సమస్త సినిమాను డైరెక్ట్ చేసేస్తుంటారు. ఉదయాన్నే ఆయనకు ఫోను చేసి ఏ సీన్లు ఆరోజు షూట్ చేయాల్సి ఉన్నదో చెబితే.. ఆయన కొన్ని సూచనలు చేస్తారు. అవి పాటించినా పాటించకపోయినా.. అసిస్టెంట్లు ఆ సీన్లు షూట్ చేసేస్తే చాలు. ఈ రకంగా అసలు లొకేషన్ కు వెళ్లి సినిమాలు స్వయంగా డైరెక్ట్ చేసే అలవాటునే మర్చిపోయిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు షూటింగులో బిజీ ఉన్నానంటూ బ్లఫ్ చేయడం చిత్రంగా కనిపిస్తోంది. 25 వ తేదీన షూటింగు ఉన్నదని ఎప్పుడో ఫిక్సయిపోయిందని ఆయన న్యాయవాది చెబుతున్నారు. ఇంతకూ రాంగోపాల్ వర్మ పోలీసులకు చిక్కిన తర్వాత.. 25న ఏం షూటింగు చేశావు.. ఎక్కడ చేశావు.. అందుకు ఆధారాలేమిటి? అని కూడా పోలీసులు అడిగితే.. ఏం సమాధానాలు చెప్పాలో వర్మ ఇప్పుడే ప్రిపేర్ చేసుకోవాలి.