తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తుల్లో ఎంత గొప్ప క్రేజ్ ఉంటుందో దేశంలో అందరికీ తెలుసు. స్వామివారికి అంత క్రేజ్ ఉన్నది గనుకనే.. ఆయన దర్శనాలు సేవల ముసుగులో భారీ అవినీతి, బ్లాక్ మార్కెటింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. సాధారణ దర్శన టికెట్లను వేల రూపాయలకు కొంటూ ఉంటారు. వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ల కోసం 15-20 వేల ధర కూడా చెల్లించి తీసుకుంటూ ఉంటారు. అలాంటిది తిరుమల స్వామివారికి జరిగే ఒక ప్రత్యేక మైన సేవలో దగ్గరుండి పూర్తిగా పాల్గొనే అవకాశం దొరుకుతుందంటే 50వేలు లక్షరూపాయలైనా కళ్లుమూసుకుని ఖర్చుపెట్టేవారు బోలెడు మంది మనకు కనిపిస్తారు. అలాంటి భక్తుల విశ్వాసాన్ని క్యాష్ చేసుకుంటూ.. టీటీడీ ముసుగులో సంపన్న దళారీలను తయారు చేయడానికి జగన్ పరిపాలనకాలంలో తీసుకువచ్చిన ఒక దుర్మార్గమైన విధానానికి తిరుమల తిరుపతి దేవస్థానాల కొత్త పాలకమండలి సంపూర్ణంగా భరతవాక్యం పలికింది.
అదేంటో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే..
తిరుమల స్వామివారికి నిర్వహించే విశేష సేవల్లో ఉదయాస్తమాన సేవ అని ఒకటి ఉంటుంది. పేరులో సూచిస్తున్నట్టుగానే ఉదయం స్వామివారికి సుప్రభాతం పాడి మేల్కొలిపే సందర్భం నుంచి రాత్రి పవళింపు సేవ వరకు అన్ని సేవలను కూడా ఈ టికెట్ కొన్న వారు ఏడాదికి ఒకసారి స్వయంగా దగ్గరుండి వీక్షించవచ్చు. ఈ టికెట్ విలువ సాధారణ రోజుల్లో అయితే కోటిరూపాయలు. స్వామివారికి అభిషేక సేవ జరిగే శుక్రవారం రోజునర కోటిన్నర రూపాయలు. టికెట్ కొన్నవారు తనతో సహా అయిదుగురితో ఈ సేవలో పాల్గొనవచ్చు. టికెట్ కొన్నప్పుడు ఎవరి పేర్లనైతే పేర్కొంటారో వారిని మాత్రమే అనుమతించే పద్ధతి గతంలో ఉండేది. అయితే తర్వాత అనేక అభ్యర్థనల మేరకు ఇతరుల్ని అనుమతించడం ప్రారంభించారు. అయితే వారు కోరిన తేదీనాటికి సేవకు వచ్చే అయిదుగురు పేర్లను, వివరాలను రెండున నెలల ముందే టీటీడీకి చెప్పాల్సి ఉంటుంది. ఈ పద్ధతి తెచ్చారు. ఈ విధానం 2013లో వచ్చింది.
అయితే జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో వైవీ సుబ్బారెడ్డి తర్వాత ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన భూమన కరుణాకర్ రెడ్డి దీనికి కొంత సవరణ చేశారు. ఉదయాస్తమాన సేవలో పాల్గొనేదాత తనతో వచ్చే అయిదుగురు పేర్లను ప్రతిసేవకూ మార్చుకునే వెసులుబాటు కల్పించారు. అంటే సుప్రభాతానికి ఓ అయిదుగురు, తోమాల సేవకు మరో అయిదుగురు, అర్చనకు మరో అయిదుగురు .. ఇలా మార్చుకుంటూ పోవచ్చునన్న మాట. అచ్చంగా స్వామివారి సేవా టికెట్లను భారీగా బ్లాకులో అమ్ముకునేందుకు చేసిన ఏర్పాటు ఇది. అయితే భూమన ఈ అవకతవక నిర్ణయం తీసుకోగానే విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటికి అమలు చేయకుండా ఆపారు.
తాజాగా బీఆర్ నాయుడు నేతృత్వంలోని పాలకమండలి ఈ తీర్మానాన్ని పూర్తిగా రద్దుచేసింది. సంపన్న దళారీలను తయారుచేయడానికి భూమన కనిపెట్టిన మార్గాన్ని పూర్తిగా తొలగించేసింది.