సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు మరింతగా ఊబిలో కూరుకుపోతున్నారు. పోలీసు విచారణకు హాజరైతే సరిపోయే దానికి, కొన్ని గంటలపాటు పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ఎంచక్కా తిరిగి వచ్చేసేదానికి బదులుగా.. రాంగోపాల్ వర్మ.. పరారీలో అదృశ్యం అయ్యే వరకు పరిస్థితుల్ని దిగజార్చుకున్నారు. గోటితో పోయే దానికి గొడ్డలి దాకా తెచ్చుకున్నట్టుగా రాంగోపాల్ వర్మ పరిస్థితుల్ని మార్చుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడు అనే హోదాను కొత్తగా సంపాదించుకున్నారు రాంగోపాల్ వర్మ.
తనకు కావల్సిన రెమ్యునరేషన్ వస్తే చాలు.. ఎవడికి ఎలా కావలిస్తే అలా సినిమా తీసిపెట్టే దర్శకుడిగా రాంగోపాల్ వర్మకు పేరుంది. ఆ సినిమాలో ఎవరిని హీరోలుగా ప్రొజెక్టు చేస్తారో.. ఎవరిని విలన్లుగా చిత్రీకరిస్తారో.. ఆ భావజాలంతో ఆయన పెద్దగా ఎటాచ్మెంట్ పెట్టుకోరు. డబ్బు ఒక్కటే ప్రయారిటీగా సినిమా చేస్తారు. సినిమా అంటూ చేస్తే దాని ప్రమోషన్ కోసం ఎలాంటి చెత్త ఇంటర్వ్యూలైనా ఇస్తూ.. సంచలనాలకు బీజం వేయడం ద్వారా… సినిమాను ప్రమోట్ చేయడానికి ఆరాటపడుతుంటారు. అలాంటి క్రమంలోనే వ్యూహం సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి ఆయన చంద్రబాబు, పవన్, లోకేష్ ల ఫోటోలను మార్ఫింగ్ చేసి పోస్టులు పెట్టడం వంటివి జరిగాయి. వాటి గురించే ఇప్పుడు కేసులు నమోదు అయ్యాయి.
కానీ రాంగోపాల్ వర్మ ఎక్కువగా భయపడ్డారు. అరెస్టు చేస్తారేమో అని వణికిపోయారు. అసలు తనపై కేసును క్వాష్ చేసేయాలని, అరెస్టు నుంచి రక్ష్ణణ కల్పించాలని కోర్టును ఆశ్రయించి భంగపడ్డారు వర్మ. నోటీసులు ఇస్తే అందుకుని ఒకసారి నాలుగురోజులు గడువు అడిగారు.. గడువు ఇచ్చిన తర్వాత.. సోమవారం విచారణకు వెళ్లాల్సి ఉండగా.. మరో రెండువారాల గుడువు కావాలంటూ మరో రిప్లయి పంపేసి హైదరాబాదు నివాసం నుంచి పరారయ్యారు. ఆయన కోసం ఒంగోలు నుంచి పోలీసులు వస్తే వారికి అందుబాటులో లేరు.
అయితే చాలా చిన్న కేసు గురించి రాంగోపాల్ వర్మ చేస్తున్న ఈ ఓవరాక్షన్ వల్ల ఆయనకే మరింత నష్టం జరుగుతుందని విశ్లేషకులు న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.