చేసిన పాపం ఊరికే పోదు. అధికారంలో ఉన్నాం కదా అని నేరాలు చేసేసి పోలీస్ అధికారులు తమ పాలకుల మాట వినే వారే గనుక వారి ద్వారా కేసును నీరుగార్చేసి ఇక అంతా అయిపోయింది అని విర్రవీగితే కుదరదు. రాజకీయ ప్రభుత్వాలు ఎప్పటికీ శాశ్వతం కాదు. ఏదో ఒక నాటికి చేసిన పాపం పండుతుంది. చేసిన నేరానికి తగిన మూల్యం తప్పకుండా చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడు ఏపీ రాజకీయాలలో అదే జరుగుతోంది. ఇదేదో సోషల్ మీడియాలో అసభ్య పోస్టులకు సంబంధించిన సంగతి కాదు. నారా చంద్రబాబు నాయుడు మీద హత్యాయత్నానికి సంబంధించిన సంగతి!
చంద్రబాబు పర్యటనలో ఉండగా కాన్వాయ్ మీదకు రాళ్లు రువ్వి చంద్రబాబు యొక్క చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గాయపడే పరిస్థితిని కల్పించిన దుర్మార్గుల ఆచూకీ ఇప్పుడు పోలీసులు రాబట్టారు. జగన్ కు అత్యంత సన్నిహితులుగా ముద్రపడిన మొండితోక సోదరులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రెండేళ్ల కిందట చంద్రబాబు మీద రాళ్ల దాడి జరిగితే, నమోదైన కేసును విజయవాడ నగర కమిషనర్ కాంతిరాణా తాతా ఉద్దేశపూర్వకంగా నీరుగార్చి తేలికపాటి సెక్షన్లతో కేసులు నమోదు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇప్పుడు విచారణలను వేగవంతం చేసి అప్పట్లో తెలుగుదేశం విడుదల చేసిన ఆధారాలతోనే కేసును చేదించారు. 17 మందిని నిందితులుగా కేసులో నమోదు చేయగా నలుగురి అరెస్టులు జరిగాయి. వారి ద్వారా అసలు చంద్రబాబు పర్యటనను భగ్నం చేయాలని ఆయన మీద హత్యకు యత్నించాలని కుట్ర ఏ రకంగా పురుడు పోసుకున్నదో కూడా వెలుగులోకి వచ్చింది. ఈ విషయంలో వారికి శిక్షలు తప్పేలా కనిపించడం లేదు.
చంద్రబాబు మీద రాళ్లతో దాడి జరిగిన రోజున ఏం జరిగిందో పోలీసులు రాబట్టారు. దాడికి రెండురోజుల ముందు ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తమ అనుచరులతో సమావేశం అయ్యారు. చంద్రబాబు కార్యక్రమాన్ని భగ్నం చేయాలని నిర్ణయించారు. మూడు బృందాలను ఏర్పాటుచేశారు. ఒకరు విద్యుత్తు సరఫరా అనుకున్నట్టుగా నిలిపివేశారు. రెండు బృందాలను రాళ్లతో దాడి చేయడానికి ఏర్పాటుచేశారు. అంతా స్కెచ్ ప్రకారమే జరిగింది.
అప్పట్లోనే తెలుగుదేశం వారు అనుమానితుల ఫోటోలను విడుదల చేశారు. ఆ ఫోటోల్లో ఇద్దరు ఒకచోట నిల్చుని ఉండగా వారి కాళ్ల వద్ద కవరులో రాళ్లు పోసుకుని ఉండడం స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు పోలీసులు వారిని విచారించగా అన్ని పేర్లు బయటకు వచ్చాయి. అప్పట్లో నమోదైన కేసు తో పాటు నేరపూరిత కుట్ర, హత్యాయత్నం తదితర సెక్షన్లను కూడా ఈ కేసులో చేర్చారు. ప్రస్తుతానికి అరెస్టు అయిన వారికి బెయిలు లభించింది. అయితే మొండితోక సోదరుల చుట్టూ ఉచ్చు బిగుసుకున్నట్లేనని వారు కూడా విచారణకు రావాల్సి ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు.