వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అదికార కూటమి పార్టీల్లోని కార్యకర్తలు తమను దారుణంగా విమర్శించేలా ముందు వారే రెచ్చగొడతారు. ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యలకు స్పందనగా.. అవతలి వైపునుంచి అంటే.. అధికార పార్టీల వారి వైపు నుంచి ఏమైనా ప్రతి విమర్శలు వస్తే.. సోషల్ మీడియాలో తమ మీద తప్పుడు పోస్టులు పెడుతున్నారని, అసభ్య పోస్టులతో వేధిస్తున్నారని అంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. దానికి పాలో అప్ గా వైసీపీ వారి మీద మాత్రం కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారు. అదే సమయంలో.. తాము ఫిర్యాదు చేస్తే మాత్రం పోలీసులు పట్టించుకోవడం లేదు అని యాగీ చేయడానికి వైసీపీ దళాలు ఒక కుట్రపూరితమైన వ్యూహం ప్రకారం అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఇమేజిని భ్రష్టు పట్టించిన నాయకుల్లో టెక్కలి నేత దువ్వాడ శ్రీనివాస్ కూడా ఒకరు. దువ్వాడ శ్రీనివాస్- దివ్వెల మాధురి ప్రేమాయణం అనేది రాష్ట్రమంతా ప్రజలందరికీ చిరపరిచితం. తమ గురించి ఒకరు బద్నాం చేసే అవకాశం లేకుండా.. తమను తామే రచ్చకీడ్చుకోవడంలో ఈ ప్రేమికులు సిద్ధహస్తులు. దువ్వాడ శ్రీనివాస్ భార్య మరియు ఆయన ప్రియురాలు మధ్య ఎన్ని రచ్చలు జరిగాయో కూడా ప్రజలందరికీ తెలుసు. ప్రియురాలితో కలిసి భార్యహోదాలో తిరుమల వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి తీసుకువెళ్లి.. ప్రేయసీప్రియులిద్దరూ ఆశీర్వచనం కూడా చేయించుకుని.. ఆ తర్వాత తిరుమలలో ప్రెస్ మీట్ పెట్టి తమ ప్రేమజీవితాన్ని సమర్థించుకుని.. తర్వాత రీల్స్ చేసి రకరకాలుగా భ్రష్టు పట్టించారు.
అలాంటి దువ్వాడ ప్రియురాలు దివ్వెల మాధురి తాజాగా టెక్కలి పోలీసులకు తన మీద అసభ్య సోషల్ మీడియా పోస్టులు వస్తున్నాయంటూ ఫిర్యాదు చేశారు. తమ ఇద్దరి మీద అత్యంత జుగుప్సాకరంగా పోస్టులు పెడుతున్నారని, వారి మీద చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్య పోస్టులు ఏమహిళ మీద వచ్చినా చర్యలు తీసుకుటాం అని చంద్రబాబు, పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత చెబుతున్నారని.. పోలీసులు ఇప్పుడు తమ నిబద్ధత నిరూపించుకోవాలని అంటున్నారు. తమ మీద జనసేన కు చెందిన వారు ఈ పోస్టులు పెట్టారని చెబుతున్నారు.
దువ్వాడ-దివ్వెల ప్రేమాయణం మీద జనసేన వారు మాత్రమే ఎందుకు పోస్టులు పెట్టారు? దీని వెనుక ఒక వ్యూహం ఉంది. ఆమె ఫిర్యాదు చేయడానికి ఒక్కరోజు ముందు దువ్వాడ శ్రీనివాస్ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కల్యాణ్ మీద ఒక రేంజిలో ఫైర్ అయ్యారు. గతంలో పవన్ కు చెప్పు చూపించి హెచ్చరించిన దువ్వాడ.. పవన్ కల్యాణ్ చెప్పు చూపించి వైసీపీ నేతలను హెచ్చరించారని, అసభ్యంగా తిట్టారని.. వైసీపీ వారిని మాత్రమే టార్గెట్ చేయాలని పిలుపు ఇస్తున్నారని.. ఇదంతా చూస్తూ ఊరుకుంటాం అనుకున్నారా? అని హెచ్చరించారు. ఆయన పవన్ కల్యాణ్ ను నానా మాటలు అనడంతో.. జనసైనికుల నుంచి తీవ్రమైన స్పందనలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారం గమనిస్తూంటే.. దువ్వాడ కావాలని జనసైనికుల్ని రెచ్చగొట్టి.. వారి నుంచి తీవ్రమైన స్పందన రాగానే.. దివ్వెల మాధురి ద్వారా పోలీసు కంప్లయింటు ఇప్పించి డ్రామా నడిపిస్తున్నారేమో అని పలువురు నవ్వుకుంటున్నారు.