జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల పదవీకాలంలో ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టిన పాపాన పోలేదు. మీడియా వారిని కలవడం, ముచ్చటించడం, ప్రభుత్వం ఏం పని చేస్తున్నదో, ఏం ఆలోచిస్తున్నదో, ఎలాంటి భవిష్యత్తుకు సిద్ధమవుతున్నదో.. వారి ద్వారా ప్రజలతో పంచుకోవడం అనే అలవాటు జగన్మోహన్ రెడ్డికి ఐదేళ్లలో ఏర్పాటు కాలేదు. ఎప్పుడైనా రాజకీయ అవసరాలకొద్దీ పార్టీ అధినేత స్వయంగా మీడియా ముందు మాట్లాడవలసిన అంత పరిస్థితి వస్తే అలాంటి సందర్భాలలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చే వాళ్లే తప్ప జగన్ ఏనాడూ ప్రెస్ మీట్ లు పెట్టలేదు. పైగా జగన్ కు ప్రెస్ మీట్ పెట్టడం అంటే కాస్త భయం అంటూ సజ్జల ఎన్నికల ముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పారుకూడా.
అయితే కేవలం 11 సీట్లు గెలిచిన పార్టీకి అధినేతగా దారుణంగా ఓడిపోయిన తర్వాత జగన్ తీరులో మార్పు వచ్చింది. కేవలం తాను ఎంపిక చేసుకున్న కొందరు మీడియా మిత్రులను మాత్రమే పిలుస్తూ ఉన్నప్పటికీ ఆయన పరిమితంగానే ప్రెస్ మీట్ లు నిర్వహిస్తున్నారు. అలాగే తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప అసెంబ్లీలో అడుగుపెట్టనని స్వార్థ, అహంకార బుద్ధిని ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డి ఆ సందర్భంలో అసెంబ్లీలో జరిగే ప్రొసీడింగ్స్ కార్యకలాపాల మీద ప్రతిరోజు ప్రెస్ మీట్ లు నిర్వహిస్తాం, అని మీడియా వాళ్ళే తనకు స్పీకర్లని ఒక ఘాటైన ప్రకటన చేశారు. డుమ్మా కొట్టడానికి అది ఒక సాకుగా మాత్రమే ఉపయోగపడింది. అసెంబ్లీ నిర్వహించిన మొత్తం రోజుల్లో ఆయన కేవలం రెండుసార్లు మాత్రమే ప్రెస్ మీట్లు నిర్వహించి.. ప్రభుత్వ నిర్ణయాలను ఆడిపోసుకోవడానికి వాడుకున్నారు.
తీరా ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టాలంటే భయపడిపోతున్నారని తాడేపల్లి వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎందుకంటే.. ఇప్పుడు అదానీ నుంచి తీసుకున్న 1750 కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ విషయంలో జగన్ తైనాతీలు రకరకాలుగా సమర్థించుకుంటున్నారు. వారి సమర్థింపు వాదనలు కూడా తేలిపోతున్నాయి. పార్టీ పరువు మరింత తీసేలా తయారవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో జగన్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ ఆరోపణలను ఖడండించాల్సిన అవసరం ఉన్నదని పార్టీ నాయకులు భావిస్తున్నారట. ఈ మేరకు ఆయనకు సలహా ఇస్తే జగన్ అందుకు విముఖంగా ఉన్నారట. ప్రెస్ మీట్ పెడితే..విలేకర్లు ఏ చిన్న సందేహం అడిగినా సరే.. ఎక్కడ దొరికిపోతానో అని ఆయన భయపడుతున్నారట. ఒకవైపు ఈ ఆరోపణలపై రాష్ట్రం ఇంత గగ్గోలుగా ఉంటే జగన్ మాత్రం ఎంచక్కా సతీసమేతంగా బెంగుళూరు యలహంక ప్యాలెస్ కువెళ్లిపోయి అక్కడ సేదతీరుతున్నారు. ఈ వివాదాన్ని జనం పూర్తిగా మరచిపోయేదాకా తిరిగి తాడేపల్లికి రాకూడదని కూడా యోచిస్తున్నట్టు సమాచారం. వచ్చినా సరే ఇప్పట్లో కొత్త ప్రెస్ మీట్ జోలికి వెళ్లకూడదని అనుకుంటున్నారట.