బాలినేని సీక్రెట్ ఫైల్స్ : జగన్ పాలన ఎట్టిదనిన..?

ప్రభుత్వంలో విద్యుత్తు శాఖ మంత్రి డిస్కం సీఎండీకి ఫోను చేసి ఏదైనా పని చెబితే.. ‘ఒకసారి కాంట్రాక్టరుకు చెప్పండి..’ అనే సమాధానం వస్తుందని మనం ఊహించగలమా? సాధారణంగా మనం ఇప్పుడున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమంత్రి తర్వాత మంత్రులు సర్వశక్తిమంతులని, వారి వారి శాఖల్లో వారి మాట వేదంగా సాగుతుందని అనుకుంటూ ఉంటాం. నిజానికి మంత్రులు అదేస్థాయిలో అధికారాలు చెలాయిస్తూ ఉంటారు కూడా. కానీ జగన్మోహన్ర రెడ్డి పరిపాలన కాలంలో.. అసలైన అధికారాలు చెలాయించినది ఎవరో తెలుసా.. ప్రెవేటు వ్యక్తులు, ఆయా శాఖలను శాసించినది కాంట్రాక్టర్లు! రాజకీయ నాయకుడిగా తన ఇమేజికి భంగకరం అని తెలిసి కూడా, తన పరువు పోతుందని తెలిసి కూడా.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా మీడియాకు వెల్లడించిన విషయాలు ఇవి.

జగన్ గద్దెమీదకు వచ్చిన తర్వాత తొలివిడత కేబినెట్లో బాలినేని విద్యుత్తుశాఖ మంత్రిగా ఉన్నారు. అయితే తన శాఖకు సంబంధించిన ఏ నిర్ణయంలో కూడా తన అభిప్రాయంతో ప్రమేయం ఉండేది కాదని బాలినేని చెబుతున్నారు. వైఎస్ కాబినెట్లో కూడా తాను పనిచేశానని, అప్పట్లో అధికారులు తన ఆదేశాల ప్రకారం పనిచేసేవారని, నిర్ణయాలు తాను తీసుకుని ఆ తర్వాత వెళ్లి వైఎస్ కు చెప్పేవాడినని ఆయన వివరిస్తున్నారు. వైఎస్ కొడుకు జగన్ తీరు మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉండేదని ఆయన ఆరోపణ. పేరుకు మాత్రమే తాను మంత్రినని, తన శాఖలో నిర్ణయాలతో తనకు ఎలాంటి సంబంధం ఉండేది కాదని ఆయన చెబుతున్నారు. సెకితో ఒప్పందాలు చేసుకున్నందుకు జగన్ కు ముడుపులు అందినట్లుగా వార్తలు చూసి నిర్ఘాంత పోయినట్టు చెబుతున్నారు. తనతో కనీసం చర్చించకుండా ఆ ఒప్పందం మొత్తం సీఎంవో స్థాయిలోనే చేశారంటున్నారు.
డిస్కంలకు సీఎండీలను నియమించే విషయంలో కూడా తన అభిప్రాయానికి విలువ ఉండేది కాదని బాలినేని స్వయంగా చెప్పడం విశేషం. సీఎండీలుగా ఎవరుండాలో ఒక కాంట్రాక్టరు నిర్ణయిస్తాడు. వాళ్లంతా ఆయన చెప్పినట్టే వినేవారు. తాను ఫోను చేసినా పట్టించుకోకుండా కాంట్రాక్టరుకు చెప్పాలని అనేవాళ్లు అంటూ బాలినేని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. జగన్ తన పరిపాలన కాలంలో.. కీలకమైన విద్యుత్తు శాఖను సమస్తంగా ఏ రకంగా ప్రెవేటు కాంట్రాక్టర్ల చేతిలో పెట్టేసి.. వారి దోపిడీలకు పచ్చజెండా ఎత్తేవారో ఇప్పుడు ప్రజలకు అర్థమవుతోంది. బాలినేని బయటకు వచ్చి చెబుతున్నారు గనుక.. ఈ అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇతర శాఖల్లో ఇంకెన్నెన్ని అక్రమాలు, తప్పుడు వ్యవహారాలు జరిగాయో.. కాలక్రమంలో బయటకు వస్తుందేమోనని పలువురు అంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories