జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఇటీవలి కాలంలో తరచుగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. చాలా సందర్భాల్లో తనకు నచ్చిన మీడియా సంస్థలకు చెందిన వారిని పరిమితంగా మాత్రమే పిలిపించి.. తాను ఏం చెప్పదలచుకున్నాడో చెప్పి పంపుతున్నాడు. అలాకాకుండా.. విలేకరులు ఎక్కువ వచ్చిన సందర్భాల్లో ఆయనకు ఒక ప్రశ్న ఎదురవుతుంటుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్టు చేశారు కదా.. అని ఎవరో ఒకరు అడుగుతారు! ఆ ప్రశ్నకు జగన్ చెప్పే జవాబు ఒక్కటే.. ‘ఆ స్కిల్ కేసులో మిగిలిన వారి మీద కూడా ఈడీ కేసు నమోదు చేసింది కదా. అంటే తప్పు జరిగినట్టే కదా’ అనేది జగన్ జవాబుౌ
ఇప్పుడు అదే డైలాగును ఆయనే గుర్తు చేసుకోవాలని కూటమి పార్టీల నాయకులు అంటున్నారు. సెకితో రాష్ట్రాల విద్యుత్తు ఒప్పందాలు.. తెరవెనుక ఉండి అదానీ లంచాలు ఇచ్చి మరీ ఆ ఒప్పందాలను పూర్తి చేయించిన వైనం అవన్నీ ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు మాత్రం.. ఒక్కటే మాట పట్టుకుని ప్రజల్ని అర్థసత్యాలతో వంచించడానికి ప్రయత్నిస్తున్నారు. ఒప్పందం కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెకితో చేసుకుంటే.. అదానీ లంచాలు ఎందుకు ఇస్తాడనేది వారి ప్రశ్న. అదానీ ఎందుకు లంచాలు ఇస్తాడో.. తెరవెనుక ఆ బాగోతం మొత్తం ఎలా జరిగిందో ఎఫ్‌బిఐ నివేదికలో విపులంగానే ఉన్నది.
అయితే ప్రత్యర్థి పార్టీల వారు గుర్తు చేస్తున్నది ఏంటంటే.. ఈ వ్యవహారానికి సంబంధించి అదానీ గ్రూపునకు చెందిన పలువురి మీద కేసులు నమోదు అయినప్పుడు.. అదే ఒప్పందాల్లో భాగంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా తప్పు చేసినట్టే కదా? అని!
తాము చెబుతున్న మాటలతో ప్రజలను నమ్మించడం అంత సులువు కాదని, ఈ అవినీతి బాగోతానికి సంబంధించి ప్రజలు అమెరికాలో నమోదైన కేసులనే నమ్ముతున్నారని జగన్ కు అర్థం కావడం లేదు. తాను, తన అనుచరులు ఎలాంటి బుకాయింపు మాటలు చెబుతోంటే ప్రజలు అవే నమ్ముతున్నారనే భ్రమలోనే ఆయన ఇంకా బతుకుతున్నారు. ఇలాంటి భ్రమల్లో ఉండే ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు.
ఎదుటివారిని నిందించడానికి జగన్మోహన్ రెడ్డి చాలా దూకుడు ప్రదర్శిస్తుంటారు. ఇప్పుడు స్పష్టంగా ఎఫ్‌బిఐ నివేదికలో చాలా స్పష్టంగా తన గురించిన ప్రస్తావన ఉన్నప్పటికీ.. అందులో నిజానిజాల గురించి తాను ప్రజలకు చెప్పుకోవాల్సిన అవసరం ఉందని ఆయన భావించడం లేదు. జగన్ తప్పు చేయలేదని అనుచరులతో మాట్లాడిస్తున్నారు. ప్రజల ను చులకనగా చూసే ఆయనలోని అహంకారానికి ఇది కూడా ఓ నిదర్శనం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.