వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు.. అనే భయంలో ఆ పార్టీకి చెందిన నాయకులు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రజలు తిరస్కరించిన తీరు ఒకటైతే, ఓడిపోయిన తర్వాత పార్టీని జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న తీరు కూడా నాయకులకు భవిష్యత్తు మీద నమ్మకం లేకుండా చేస్తోంది. ఇక్కడికే సగం మంది పార్టీ కార్యకర్తలు నాయకులు.. విసిగిపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో కొత్తగా.. పులిమీద పుట్రలాగా.. అదానీ నుంచి 1750 కోట్ల రూపాయల లంచాలు కాజేసినట్టుగా అమెరికాలో ఎఫ్బిఐ నమోదు చేసిన కేసు వెలుగులోకి వచ్చింది. వైసీపీతో బంం ఇక చాలు అనుకుంటున్న వారు తక్షణం రాజీనామా చేసేలా.. ఈ లంచాల కేసు కూడా ప్రేరేపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ తన ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం ఇందుకు ఉదాహరణ.
జయమగళ వెంకటరమణ ఎన్నికలకు కొద్దికాలం ముందే తెలుగుదేశం నుంచి వైసీపీ లో చేరారు. అప్పట్లోనే రకరకాల బెదిరింపులతో పార్టీలో చేర్చుకున్నారనే పుకార్లు వినిపించాయి. వాటికి తోడు.. ఆయన పార్టీలో చేరిన వెంటనే.. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ఆ కోటాలో ఆయనకు పదవిని కట్టబెట్టారు. అంటే జయమంగళు ఇంకా సుమారు అయిదేళ్ల దాకా ఎమ్మెల్సీ పదవీ యోగం ఉంది. దానిని కూడా వద్దనుకుని ఆయన తన పదవికి , పార్టీకి కూడా రాజీనామా చేసేశారంటే.. ఆ పార్టీలో ఉంటే భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుందని ఎంతగా భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
జగన్ తన పరిపాలన సాగిన రోజుల్లో ఎమ్మెల్యేలకు కూడా విలువ లేకుండా తన ముద్రగల పాలన నడిపించారు. పార్టీ ఓడిపోయిన తరువాత.. రాజీనామాలు చేసిన పలువురు.. తమకు ఆ పార్టీలో పదవులు దక్కాయే తప్ప ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా పోయిందని, తమను నామమాత్రంగా కూడా గుర్తించలేదనే ఆరోపణనే వినిపించారు. పార్టీ నిర్వహణ తీరులో అస్తవ్యస్తత కారణంగానే అనేకమంది పార్టీని వీడిపోతున్నట్టుగా చెబుతున్నారు.
ఇప్పుడు జగన్ అవినీతి పుట్ట పగలడం.. ఏకంగా రాష్ట్ర ప్రజల మీద విద్యత్తు భారం మోపుతూ.. 1750 కోట్ల రూపాయలు జగన కాజేసినట్టు లెక్క తేలడం అనేది ఆ పార్టీ సొంత నాయకుల్నే పునరాలోచనలో పడేస్తోంది. ఇక ప్రజల నమ్మకాన్ని చూరగొనడం కష్టం అని.. ఎంత త్వరగా పార్టీని వీడిపోతే.. అంతగా తమ భవిష్యత్తు బాగుంటుందని వారు అనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. అందుకు ఉదాహరణగానే జయమంగళ రాజీనామా కనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.