డెడ్‌లైన్ ప్రకటించి ఆశలు నింపుతున్న చంద్రబాబు!

ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి పార్టీలకు పడిన ప్రతి ఓటు కూడా అమరావతి రాజధానికి అనుకూలంగా పడినదే అని అనుకోవచ్చు. ఎందుకంటే మూడు రాజధానుల పేరిట జగన్మోహన్ రెడ్డి పెద్ద డ్రామా నడిపిస్తే.. కనీసం ఆయన ఎగ్జిక్యూటివ్ రాజధాని అని ప్రకటించిన విశాఖ వాసులు కూడా ఆ పార్టీని దారుణంగా తిప్పికొట్టారు. ఇదే రుజువు. అంటే రాష్ట్రం మొత్తం కూడా అమరావతి రాజధానిని స్వప్నిస్తోందన్న మాట నిజం. ఆ రీతిగా అమరావతిని కోరుకుంటున్న ప్రజలకు డెడ్ లైన్ లతో సహా గొప్ప శుభవార్తను అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. మూడేళ్లలోగా అమరావతికి ఒక స్పష్టమైన రూపురేఖలు వస్తాయని ఆయన చాలా నమ్మకంగా చెబుతున్నారు.

అమరావతి కోసం ప్రస్తుతం యాభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పాత టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లను పిలిచామని, డిసెంబరు 15 నుంచి పనులు ప్రారంభం కాబోతున్నాయని చంద్రబాబు అంటున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్లు ఆరునెలల్లోగా పూర్తిచేస్తాం అని సీఎం ప్రకటించడం గొప్ప సంగతి. ఎమ్మెల్యేలందరికీ ఇక్కడే క్వార్టర్లు ఇస్తామని అంటున్నారు. ముందు ఎమ్మెల్యేలకు అక్కడే క్వార్టర్లు కూడా అప్పగించేస్తే.. వెంటవెంటనే.. వారి నివాసానికి తగినట్టుగా ఇతర మౌలిక వసతులు కూడా ఆటోమేటిగ్గా ఏర్పడతాయని అనుకోవచ్చు. దానికి అనుబంధంగా అమరావతిలో ఇప్పటికే తమ తమ ప్లాట్ల కేటాయింపును కూడా పొందిన రైతుల జాగాల్లో ప్రెవేటు నిర్మాణాలు కూడా ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుంది.
నివాసాలు, కార్యాలయాలు, రోడ్లు అన్నీ అభివృద్ధి చేస్తూ మూడేళ్లలో రూపు తీసుకువస్తాం అని చంద్రబాబునాయుడు అంటున్నారు. పనులు ఒక ఏడాది ఆలస్యం అయినా సరే.. నాలుగేళ్లలోగా అమరావతి ఒక రూపు సంతరించుకునే అవకాశం ఉంది. ఈలోగానే ఐకానిక్ భవనాలుగా అమరావతికి వన్నెతెచ్చేలా నిర్మాణం కావాల్సి ఉన్న అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ నిర్మాణాలు ఒక దశకు చేరుకుంటాయి. అంత తొందరగా అవి పూర్తి కాకపోవచ్చు గానీ.. ఒక దశకు చేరుకుంటాయి. పూర్తిగా కేంద్ర నిధులతో నిర్మాణం కావాల్సి ఉన్న అవుటర్ రింగ్ రోడ్డు, రైల్వే స్టేషన్, మెట్రో నిర్మాణాలు కూడా త్వరగా జరిగాయంటే.. ఈ అయిదేళ్లు చంద్రబాబు ప్రభుత్వ కాలంలోనే అమరావతి ప్రజల స్వప్నాలను నిజంచేస్తూ కనుల ఎదుటకు వస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories