పీఏసీ రూపంలో మరో నాటకానికి తెరలేపిన జగన్!

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి ఒక చెక్ పాయింట్ వంటిది. శాసనసభ ప్రతినిధులతోనే ఈ కమిటీ కూర్పు జరుగుతుంది. సాధారణంగా ప్రతిపక్షానికి చెందిన ఒక ఎమ్మెల్యేను పీఏసీ ఛైర్మన్ గా నియమిస్తారు.అయితే ప్రతిపక్షం అనదగిన స్థాయి లేకపోయినప్పటికీ కూడా.. ఇప్పటికే తనకు కేబినెట్ సమాన నేత హోదా కావాలంటూ గోల చేస్తున్న జగన్మోహన్ రెడ్డి తమ పార్టీకి పీఏసీ ఛైర్మన్ పదవి కూడా కావాలంటూ కొత్త డ్రామా నడిపించడానికి తెర లేపారు. బలం లేకపోయినా సరే ఇలాంటి డ్రామా అనేది నిందలు వేయడానికి తప్ప మరొకటి కాదని ప్రజలు అనుకుంటున్నారు.

పీఏసీ కమిటీ కూర్పు ప్రస్తుతం జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఆ ఛైర్మన్ పదవికి వైసీపీకి చెందిన పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేశారు. ఈ పదవి ఎన్నికకు గురువారం మధ్యాహ్నం ఆయన నామినేషన్ వేయడం జరిగింది.
అయితే తెలుగుదేశం పార్టీ లేదా స్పీకరు అయ్యన్నపాత్రుడు దయపెడితే తప్ప.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పీఏసీ ఛైర్మన్ పదవి దక్కే అవకాశం లేదు. ఛైర్మన్ కాదు కదా.. పీఏసీలో ఒక్క సభ్యుడిగా కూడా పదవి దక్కే అవకాశం వైఎస్సార్ కాంగ్రెస్ కు లేదు.

పీఏసీలో సభ్యుడు కావాలంటే.. కనీసం పది శాతం ఎమ్మెల్యేలు ఆ పార్టీకి శాసనసభలో ఉండాలి. అంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. వైసీపీకి ప్రస్తుతం ఉన్నది కేవలం 11 మంది మాత్రమే. పీఏసీలో మొత్తం 12 మంది సభ్యులుంటారు. 9 మంది శాసనసభ నుంచి 3 మంది మండలి నుంచి ఉంటారు. మండలిలో వైసీపీకి బలం ఉన్నది గనుక.. అక్కడినుంచి కనీసం ఇద్దరు సభ్యులైనా ఉండే అవకాశం ఉంది. కానీ.. పీఏసీ ఛైర్మన్ గా శాసనసభ నుంచి మాత్రమే ఉంటారు. దీనిపై తుదినిర్ణయం స్పీకరు తీసుకుంటారు.

కాగా పీఏసీలో  అసెంబ్లీనుంచి ఒక్క సభ్యుడిని నియమించుకోగల బలం కూడా లేనప్పటికీ.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేయడం అనేది పరువు తీసుకునే వ్యవహారంగా కనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం బలం తక్కువగా ఉండడంతో ఆ పార్టీ తరఫున ఒక్క సభ్యుడుగా పయ్యావుల కేశవ్ పీఏసీలో ఉన్నారు. సంప్రదాయం ప్రకారం ఆయన ఛైర్మన్ అయ్యారు.  

ఈసారి బలం లేదు గనుక వైసీపీలో ఎవ్వరూ అసెంబ్లీనుంచి సభ్యుడు ఉండే అవకాశం కూడా లేదు. దీంతో స్పీకరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కీలకం అయింది. పెద్దిరెడ్డికి అవకాశం దక్కకపోతే సాంప్రదాయం ప్రకారం ప్రతిపక్షానికి ఛైర్మన్ పదవి ఇవ్వలేదు అని వైసీపీ మరో విలాపం ప్రారంభించే అవకాశం ఉంది. ప్రతిపక్షానికి ఛైర్మన్ పదవి అనేది సాంప్రదాయమే తప్ప నియమం కాదని పలువురు గుర్తు చేస్తున్నారు. అయినా సభ్యుడిని గెలిపించుకోగల బలం కూడా లేకుండా ఛైర్మన్ పదవి ఎలా వస్తుందని అంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories