‘‘రాజకీయ పార్టీ విధానాలు నచ్చకపోతే విమర్శించాలి తప్ప.. అసభ్య పదజాలంతో వారి కుటుంబసభ్యులు, తల్లులపై దాడి చేయడం ఏమిటి? అసభ్యకర భఆషను వినియోగించే ఏ పార్టీ వారినైనా శిక్షించాల్సిందే. ఇలాంటి భాష మాట్లాడడం ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేయడమే..’’ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇవి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వెల్లువలా వస్తున్న తప్పుడు పోస్టుల వివాదాలు తారస్థాయికి చేరుతున్న వేళ.. హైకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కీలకం. అసభ్య పదజాలంతో తప్పుడు పోస్టులు పెట్టే వారికి ఎప్పటికైనా సరే శిక్ష తప్పదనే హెచ్చరిక హైకోర్టు వ్యాఖ్యల్లో కనిపిస్తోంది.
గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడుకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ఈ వ్యాఖ్యలు చేశారు. మనోహర్ నాయుడు గతంలో చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం, జనసేన నాయకులు కలిసి శాంతియుత నిరసన కార్యక్రమాలు చేస్తున్న సమయంలో .. అక్కడకు వచ్చి.. అసభ్య పదజాలంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను కూడా దూషించడం మాత్రమే కాకుండా, పోలీసుల నుంచి లాఠీని లాక్కుని నిరసన కారులపై దాడిచేసి కొట్టారని కూడా ఇప్పుడు కేసు నమోదు అయింది. పవన్, నారా లోకేష్ ను అసభ్య పదజాలంతో అవమానిస్తూ మీడియా ముందు మాట్లాడారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును కొట్టేయాలంటూ గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు క్వాష్ పిటిషన్ వేయడంతో.. విచారణ జరిగింది.
గుంటూరు మేయర్ మాట్లాడిన మాటల తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఆయనమీద ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు నగర ప్రథమ పౌరుడు మాట్లాడే భాష ఇదేనా అని ప్రశ్నించింది. బాధ్యత ఉండక్కర్లేదా అని బుద్ధి చెప్పింది. సేవ చేసి ప్రజలకు దగ్గరవ్వావలి కానీ.. అసభ్య భాషతో కాదని హితవు పలికింది.
మనోహర్ నాయుడుకు 41ఏ నోటీసులు ఇచ్చి విచారించాలని, ఆయన పోలీసు విచారణకు సహకరించాలని కోర్టు సూచించింది.
ఇదంతా పక్కన పెడితే.. అసభ్య భాషతో కూడిన పోస్టుల విషయంలో హైకోర్టు దృక్పథం ఎలా ఉంటున్నదో సైకోలందరికీ అర్థమైనట్టే. తప్పుడు పోస్టులు పెడుతూ తప్పించుకు తిరగడం ఎల్లకాలమూ సాధ్యం కాదని అందరూ అర్థం చేసుకోవాలి. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులకు తెరపడాలని ప్రజలు కోరుకుంటున్నారు.