ఏదో సినిమా ప్రమోషన్ కోసం అప్పటికప్పుడు ఆపద్ధర్మంగా ప్రత్యర్థి పార్టీ నాయకులను ప్రస్తావించి అసభ్యంగా పోస్టులు పెట్టిన పాపం .. ఈ రేంజిలో మెడకు చుట్టుకుంటుందని బహుశా ఈ దర్శకుడు ఊహించి ఉండడు! ఇప్పుడు ఆయన పోలీసు విచారణకు వెళితే తనను అరెస్టు చేసేస్తారేమో అని భయపడుతున్నారు. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి నమోదైన కేసుల్లో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు.
పద్ధతిగా తాను కోరుకున్నంత రెమ్యునరేషన్ ఇస్తే చాలు.. ఎలాంటి సబ్జెక్టు ఇచ్చినా మీ కళ్లలో ఆనందం చూడడం కోసం సినిమా తీసేస్తా. పద్ధతిగా గిట్టుబాటు అయితే చాలు.. ఆ సినిమా ప్రమోషన్స్ అయితే చాలు.. అందుకోసం ఎంత చవకబారు ప్రచారం టెక్నిక్ లకు అయినా దిగజారుతా? అన్నట్టుగా ఉంటుంది రాంగోపాల్ వర్మ స్టయిలు. సినిమాకు సినిమాకు మధ్య మాయమైపోయి.. సినిమా ఉన్నప్పుడు మాత్రం.. బొడ్డూడని టీవీ/యూట్యూబ్ చానెళ్ల వారిని కూడా పిలిచి మరీ ఇంటర్వ్యూలు ఇచ్చే రాంగోపాల్ వర్మ.. ఆ సినిమా ప్రమోషన్ ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలనైనా అలవోకగా చేసేస్తుంటారు. ఆక్రమంలో ఇప్పుడు పోలీసు కేసులో ఇరుక్కున్నారు.
జగన్ జీవితంలోని ఒక భాగాన్ని చరిత్రలాగా ఆయన వ్యూహం పేరుతో సినిమా తీశారు. వైఎస్సార్ కాంగ్రెస్ కు పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయడానికి తీసిన సినిమా అది. సినిమా చెత్తగా తయారు కావడం అనేది వేరే సంగతి. అయితే ఆ సినిమా నాలుగు టికెట్లు తెగేలా ప్రమోషన్లు చేయడానికి రాంగోపాల్ ఇంటర్వ్యూలతో పాటు చాలా ప్రయత్నాలు చేశారు. సోషల్ మీడియా పోస్టులు కూడా పెట్టారు. వ్యూహం కోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను అసభ్యంగా చిత్రీకరిస్తూ వ్యూహాత్మక అడుగుల వేశారు. అలాంటి కుటిలయత్నాలన్నీ కలిసి సినిమాకు టికెట్లు అమ్ముడయ్యేలా ఉపయోగపడతాయని అనుకున్నారు. కానీ పాచిక పారలేదు. బెడిసికొట్టింది. సినిమాను కనీసం వైసీపీ కార్యకర్తలు కూడా పూర్తిగా చూడలేదు. చూడడానికి వెళ్లినవారు పూర్తిగా సినిమా అయ్యేదాకా కూర్చోలేకపోయారు.
సోషల్ మీడియాలో పెట్టిన తప్పుడు పోస్టులకు సంబంధించి రాంగోపాల్ వర్మకు మద్దిపాడు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వాటి ప్రకారం ఇవాళ ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. వాట్సప్ లో ఇంకా నాలుగురోజుల సమయం కావాలని అడిగారు. ఈలోగా ఆయన అరెస్టు నుంచి రక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించారు గానీ.. న్యాయస్థానం ఆ పిటిషన్ ను తిరస్కరించింది. ఇప్పుడు విచారణకు డుమ్మా కొట్టడాన్ని గమనిస్తే ఆయనలో అరెస్టు భయం ఉన్నదేమో అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది. అలాగని, విచారణకు హాజరు కాకుండా పారిపోగల అవకాశం కూడా లేదు కదా అని పలువురు విశ్లేషిస్తున్నారు.