వైసీపీ తమాషా : వాళ్లు అవుట్.. వీళ్లు వాకవుట్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను  గెలిపించిన ప్రజల నమ్మకంతో ఆ పార్టీ వారు తమాషా చేస్తున్నారు. ప్రజలు పెట్టుకున్న విశ్వాసంతో ఆడుకుంటున్నారు. అవహేళన చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఏకంగా శాసన సభ లోపలకు కూడా రాకుండా బయటనే కూర్చుని వినోదం చూస్తుండగా.. ఎమ్మెల్సీలు శాసనమండలిలోకి వస్తున్నారు గానీ.. వాకవుట్ చేయడమే తమ జీవితాశయం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఈ రెండు సభల కోసం వైసీపీ ప్రతినిధులను ఎన్నుకున్న ప్రజలకు వెగటు పుట్టేలాగా వీరి ప్రవర్తన ఉంటోంది.

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి .. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేవరకు శాసనసభకు రాను అని తెగేసి చెప్పేసిన సంగతి తెలిసిందే. ఆయన సంగతి ఎలా ఉన్నప్పటికీ.. తన పార్టీకి చెందిన మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్లకుండా ఆయన కట్టడి చేసేశారు. ఎమ్మెల్యేలు వెళ్లి, తాను వెళ్లకపోతే  ప్రజలు తనను మరింతగా అసహ్యించుకుంటారని ఆయన భయపడ్డారో ఏమో తెలియదు. లేదా, ఎమ్మెల్యేలందరూ తనకు సంఘీభావంగా శాసనసభను బహిష్కరిస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వాలనుకున్నారో ఏమో కూడా తెలియదు. రెండో కారణం నిజమైతే.. మండలిలో మెజారిటీగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీలు కూడా జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే డిమాండ్ కు మద్దతుగా తాము కూడా వెళ్లకుండా ఉంటే ఆ వాదనను నమ్మవచ్చు. కానీ.. మండలి సభ్యులు మాత్రం సభకు వస్తున్నారు.

శాసనమండలిలో మెజారిటీ ఉన్నది గనుక వైసీపీ వారు వస్తున్నారని, శాసనసభలో లేదు గనుక సిగ్గుతో రాలేకపోతున్నారని అర్థమవుతోంది.

అయితే మండలికి వస్తున్నవారు కూడా నానా రభస చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప.. సజావుగా సభ జరగడానికి సహకరించడం లేదు. ప్రభుత్వం తీసుకువస్తున్న బిల్లుల మీద ప్రజా సమస్యల మీద అర్థవంతమైన చర్చలు జరగడానికి వారు ప్రయత్నించడం లేదు. మంత్రుల ప్రసంగాలకు అడ్డుపడుతూ రచ్చ చేయడం.. సభ నుంచి వాకవుట్ చేయడం అనేది వైసీపీ ఎమ్మెల్సీలకు నిత్యకృత్యంగా మారింది. బొత్స సత్యనారాయణ నాయకత్వంలో ఈ ఎమ్మెల్సీలు పదేపదే వాకవుట్ చేస్తున్నారు.

ఈ పోకడ గమనించినప్పుడు… ఎమ్మెల్యేలంతా సభకు రాకుండా ‘అవుట్’ ఏరియాలోనే ఉన్నారని, ఎమ్మెల్సీలు వచ్చినా కూడా ‘వాకవుట్’ ధోరణి చూపిస్తున్నారని ప్రజలు జోకులు వేసుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories