శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు.. క్రమంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కొరకరాని కొయ్యగా మారుతున్నారా? ఆయన నిబంధనలకు అనుగుణంగా మాత్రమే ప్రవర్తిస్తుండడం.. తాను ఆడించినట్టు ఆడకపోవడం, తన పార్టీ ఎమ్మెల్సీల డిమాండ్లకు తలొగ్గి పనిచేయకపోవడం అనేది జగన్మోహన్ రెడ్డికి మింగుడుపడడం లేదా? ఇప్పుడు వాతావరణం చూస్తే అలాగే అనిపిస్తోంది. శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నఎమ్మెల్సీలు తమ ఇష్టమొచ్చినట్టుగా సభను దారి మళ్లించడానికి చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతుండడం వైసీపీ అధినేతకు జీర్ణం కావడం లేదు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష నేతగా హోదా కల్పిస్తే తప్ప శాసనసభలో అడుగుపెట్టను అంటూ భీష్మించుకుని ఇంటికే పరిమితం అయిపోయారు. 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి సభకు వెళ్లడం అనేది ఆయనకు చాలా అవమానంగా అనిపిస్తున్నందువల్లనే వెళ్లడం లేదనేది జగమెరిగిన సత్యం. అదే సమయంలో- తమ పార్టీ సభ్యుల మెజారిటీ ఉన్న శాసనమండలికి మాత్రం ఎమ్మెల్సీలు అందరూ వెళ్లాలని ప్రజల సమస్యలపై పోరాడాలని ఆయన నిర్దేశించారు. అక్కడ మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు కూడా తమ పార్టీకి చెందిన నాయకుడే గనుక.. అక్కడ తమ పార్టీకి మెజారిటీ కూడా ఉన్నది గనుక.. తాను ఆడించినట్టు ఆ సభ జరుగుతుందని.. అక్కడ తన మాట శాసనంలాగా సాగుతుందని.. మండలినుంచి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుందని జగన్ భావించినట్టుగా ఉంది. అయితే ప్రతిదీ ఆయన అనుకున్నట్టుగా సాగడం లేదు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైకోల మీద పెడుతున్న కేసులు, అరెస్టుల వ్యవహారానికి సంబంధించి చర్చ జరగాల్సిందిగా వైసీపీ నాయకులు మండలిలో పట్టుపట్టినప్పుడు ఛైర్మన్ మోషేన్ రాజు అనుమతించలేదు. వైసీపీ ఎమ్మెల్సీలు ఛైర్మన్ పోడియం వద్దకు దూసుకెళ్లి అల్లరి చేయడానికి కూడా వెనకాడలేదు. తమ వాయిదా తీర్మానంపై ఆ పార్టీనేత బొత్స ఎంత డిమాండ్ చేసినా కొయ్యే మోషేన్ రాజు పట్టించుకోలేదు.
వాళ్ల అల్లరి నడుమే ఛైర్మన్ సభను నిర్వహించి తర్వాత వాయిదా వేశారు. అయితే తమ పార్టీకి చెందిన సభాపతి.. తమ ఆందోళనలను అనుమతించకపోవడం బహుశా వైసీపీ నేతలకు, మండలిలో చక్రం తిప్పవచ్చుననుకున్న జగన్ కు మింగుడుపడి ఉండదని ప్రజలు అనుకుంటున్నారు.