వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైకోల మీద కేసులు నమోదు కావడం అనే పర్వం నెక్ట్స్ లెవెల్ కు వెళుతోంది. మామూలు కార్యకర్తలకు నోటీసులు ఇవ్వడమూ, శృతిమించిన వారిని అరెస్టు చేయడమూ ఎలా జరుగుతున్నదో అందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు ఆ తర్వాతి స్థాయి వారి మీదకు కూడా కేసులు వెళుతున్నాయి. మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే నోటిదూకుడుకు, బూతులకు పేరుమోసిన నాయకుడు కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని మీద తాజాగా ఒక కేసు నమోదు అయింది. ఈ కేసు పెట్టినది.. లా చదువుతున్న ఒక అమ్మాయి కావడం విశేషం.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో కొడాలి నాని మూడేళ్లపాటు చంద్రబాబును, లోకేష్ ను సామాజిక మాధ్యమాల్లో అసభ్యమైన భాషలో దుర్భాషలాడాడని, ఒక మహిళగా ఆ తిట్లు భరించలేకపోయానని ఆంధ్రా యూనివర్సిటీలో న్యాయవిద్య చదువుతున్న అంజనప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కొడాలి నాని మీద విశాఖపట్నంలో కేసు నమోదు అయింది. అసభ్య పదజాలం, సోషల్ మీడియా పోస్టులు- అనే కేటగిరిల కింద పార్టీ సామాన్య కార్యకర్తలు మాత్రమే కాకుండా ఒక స్థాయికి మించిన నాయకుల మీద కేసు నమోదు కావడం ఇదే ప్రథమం. వైసీపీలో ఆ రికార్డు కొడాలి నానికే దక్కింది.
కొడాలి నాని అంటే.. ఆయన మాట తీరు గురించి, వాడే భాష గురించి, అందులో పుష్కలంగా పొంగి పొర్లే అసభ్యత, కుసంస్కారం గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. నోరు విప్పితే చాలు బూతులను వర్షించడంలో ఆయనకు రాష్ట్రంలో తిరుగులేని కీర్తిప్రతిష్టలు ఉన్నాయి. ‘అసలే కోతి ఆపై కల్లుతాగింది.. ఆ పిమ్మట ముల్లు గుచ్చుకుంది.. ఇక చెప్పాలా..’ అనే సామెత మాదిరిగా.. అసలే బూతుల్లో ఉద్ధండుడు అయిన కొడాలి నాని, తన ధోరణికి అధికారమదం కూడా తోడైన రోజుల్లో మరింతగా రెచ్చిపోయారు. చంద్రబాబును, లోకేష్ ను, పవన్ కల్యాణ్ ను ఎంతెంత నీచంగా తిడుతూ వచ్చారో ప్రజలు చూశారు. ఎన్నికల దాకా అదే ధోరణిలో ఉండి, ఓటమి తర్వాత సైలెంట్ అయ్యారు. తీరా ఇప్పుడు కొడాలి నాని మీద కూడా కేసు నమోదు అయింది. ఇలాంటి కేసులో కొడాలి నానితో ఆగవని, ఇంకా ఇలాంటి వాచాలత ఉన్న అనేక మంది పెద్ద నాయకులు, అలాగే తెరఉండి సోషల్ మీడియా విష ప్రచారాలకు మూలకేంద్రాలుగా నిలిచిన సీనియర్ నాయకుల మీద కూడా కేసులు సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది.