సోషల్ మీడియా పాపాలు ఒక లెవెల్ దాటి, నెక్ట్స్ లెవెల్ లోకి ప్రవేశిస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. రాఘవరెడ్డి కూడా దొరికితే తర్వాత పరిస్థితి ఏమిటి? ఇలాంటి తప్పుడు, అసభ్యకరమైన పోస్టులు పెట్టించడం వెనుక స్వయంగా వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర ఎంత? అనేది ఇంకా స్పష్టం అవుతుంది. ఒకసారి రాఘవరెడ్డి దొరికితే సోషల్ మీడియా సైకోలపై సాగుతున్న విచారణల వ్యవహారం ఒక్కసారిగా గేరు మారుతుందనే అభిప్రాయాలు పలువురిలో వ్యక్తం అవుతున్నాయి. అవినాష్ రెడ్డికి చిక్కులు తప్పకపోవచ్చునని అనుకుంటున్నారు.
పులివెందులకు చెందిన వర్రా రవీందర్ రెడ్డి వైఎస్ భారతికి పీఏగా తొలుత ప్రచారం జరిగింది. తర్వాత భారతి సిమెంట్స్ ఉద్యోగి అని అన్నారు. ఏది ఏమైనా భారతికి, అవినాష్ రెడ్డికి ఆయన అనుంగు అనుచరుడు అనే సంగతి మాత్రం ప్రజలకు అర్థమైంది. ఆ వర్రా రవీందర్ రెడ్డి.. సాక్షాత్తూ వైఎస్ రాజశేఖరరెడ్డి భార్య విజయమ్మ శీలాన్ని అనుమానించేలాగా పెట్టిన పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వర్రా ఎంత నీచమైన పోస్టులు పెట్టాడనేది చాలా మంది చూసి ఉండకపోవచ్చు. కానీ.. చూస్తే ఎవ్వరూ సహించలేరని మాత్రం అనిపిస్తుంది.
ఆ వర్రా రవీందర్ రెడ్డి అరెస్టు అయిన తర్వాత పోలీసు విచారణలో తాను పెట్టిన పోస్టుల్లోని కంటెంట్ మొత్తం వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన పీఏ రాఘవరెడ్డి లనుంచే వచ్చేదని వెల్లడించారు. వారిద్దరూ పోస్టుల గురించి మాట్లాడుకుని ఏం పెట్టాలో డిసైడ్ చేసేవారని కూడా చెప్పారు. వర్రా రవీందర్ రెడ్డి ఆ రకంగా వాస్తవాలు బయటపెట్టిన తర్వాత వైఎస్ అవినాష్ కోటరీలో భయం మొదలైంది. ఆయన పీఏ రాఘవరెడ్డి పరారయ్యారు. వారం కిందటే పోలీసులు ఆయనకోసం ప్రయత్నించినా దొరకలేదు.
ఆయనకోసం పోలీసులు సెర్చ్ వారంట్ జారీ చేశారు. ఆయన ఇంటికి నోటీసు అంటించారు. ఇప్పుడు రాఘవరెడ్డి పోలీసులకు చిక్కితే గనుక.. అవినాష్ రెడ్డి కష్టాల్లో పడతారని అందరూ ఊహిస్తున్నారు. వర్రా రవీందర్ రెడ్డి చెప్పినట్టుగా, రాఘవరెడ్డి కూడా అవినాష్ పేరు చెబితే గనుక.. ఆయనను ఎవ్వరూ కాపాడలేరనే వాదన వినిపిస్తోంది. మరి రాఘవరెడ్డి ఎక్కడకు పరారయ్యారో.. ఆయనను ఎవరు ఎక్కడ దాచి ఉంచారో పోలీసులు ఎప్పటికి పట్టుకుంటారో.. అసలు సూత్రధారులు ఎప్పటికి బయబకు వస్తారో వేచిచూడాలి.