నివాళి : చంద్రబాబునుంచి విలువలు నేర్చుకున్న తమ్ముడు!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో మరణించారు. అనారోగ్యం కారణంగా హైదరాబాదు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నారా రామ్మూర్తి నాయుడు.. శనివారం మధ్యాహ్నం తర్వాత తుదిశ్వాస విడిచారు. రామ్మూర్తి నాయుడు కొడుకు నారా రోహిత్ తెలుగు సినిమా హీరోగా ఉన్న సంగతి అందరికీ తెలుసు. రోహిత్ కు నెలకిందటే వివాహనిశ్చితార్థం కూడా అయింది. ఈలోగా వారి కుటుంబంలో ఈ విషాదం చోటుచేసుకుంది. రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ఆదివారం వారి స్వగ్రామం పూర్వ చిత్తూరుజిల్లాలోని నారావారిపల్లెలో జరుగుతాయి.

నారా రామ్మూర్తి నాయుడు 1994లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. చిత్తూరు జిల్లాలోనే అప్పట్లో అన్నదమ్ములు ఇద్దరూ చెరొక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. ప్రజా జీవితంలో ఎలా మసలుకోవాలో.. ప్రజలతో నిత్యం ఎలా మమేకమై ఉండాలో.. ఎలాంటి విలువలు పాటించాలో స్వయంగా చంద్రబాబునాయుడుకు తమ్ముడికి నేర్పాడని జిల్లాలోని సీనియర్ నాయకులు అంటుంటారు. చిత్తూరుజిల్లా కబడ్డీ సంఘానికి కూడా రామ్మూర్తి సారధిగా ఉంటూ అనేక కార్యక్రమాలు నిర్వహించారు.

1994 తర్వాత ఆయన మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలంగా లేరు. అనారోగ్య కారణాల వల్ల కొంతకాలం దూరంగా ఉన్నారు. తర్వాత ఒకటిరెండు సార్లు ప్రయత్నించారు గానీ చంద్రబాబు వారించారు. కొన్ని సంవత్సరాల కిందటినుంచి అనారోగ్యం బారిన పడిన రామ్మూర్తి నాయుడు.. క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. కేవలం రాజకీయాలు మాత్రమే కాదు.. అసలు బాహ్య ప్రపంచానికే దూరంగా, పబ్లిక్ లోకి ఏ కార్యక్రమాలకూ కూడా రాకుండా ఉండిపోయారు.

ఆయన గుండెసమస్యలో హైదరాబాదు ఏఐజీలో చేరిన తర్వాత పరిస్థితి విషమించింది. చిన్నాన్న పరిస్థితి తెలియడంతో ఏపీ మంత్రి నారా లోకేష్ తన కార్యక్రమాలు రద్దు చేసుకుని హైదరాబాదు చేరుకున్నారు. మరణవార్త తెలియగానే ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడు తన కార్యక్రమాలు రద్దు చేసుకుని ప్రత్యేక విమానంలో.. హైదరాబాదు వస్తున్నారు. పలువురు తెలుగుదేశం నాయకులు, సినీ సెలబ్రిటీలు రామ్మూర్తి మృతిపట్ల సంతాపం వెలిబుచ్చుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories