రాష్ట్రంలో వైద్య విద్య అభ్యసించే విద్యార్థులకు తెలుగుదేశం ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తున్నట్లుగా మసిపూసి మారేడుకాయ చేయడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. తాము మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తే వాటిలో అడ్మిషన్లకు సీట్లు రాకుండా నిరాకరించడం ద్వారా వైద్య విద్యార్థులకు ప్రభుత్వం ద్రోహం చేసిందని ఆయన అంటున్నారు. అయితే ఇలాంటి తప్పుడు ప్రచారాలకు శాసనమండలి వేదికగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి భారతీయ జనతా పార్టీకి చెందిన సత్య కుమార్ దీటైన జవాబు ఇచ్చారు. తాను ప్రారంభించానని గప్పాలు కొట్టుకుంటున్న వైద్య కళాశాలలకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో ఎంత అన్యాయం జరిగిందో.. వైద్య విద్యార్థులను మాయ చేస్తూ వారిలో అపోహలు సృష్టించడానికి ఇప్పటిదాకా ఎలాంటి తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారో.. ఆయన ఫోటోలు, గణాంకాలతో సహా ఎండగట్టారు.
కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని వైసీపీ పరిపాలన కాలంలో ఐదేళ్ల లో ఈ కాలేజీల భవనాల నిర్మాణాలను పూర్తి చేయకపోవడమే వారి నిర్లక్ష్యానికి, ఆ రంగానికి చేసిన ద్రోహానికి నిదర్శనం అని సత్యకుమార్ ఆరోపిస్తున్నారు. రికార్డు వ్యవధిలో ఏడాది రోజుల్లో తాడేపల్లి ప్యాలెస్ కట్టారని.. 26 జిల్లాల్లో ప్రభుత్వ భూములు తీసుకుని వైసిపి పార్టీ ఆఫీసులు కట్టుకున్నారని.. ఋషికొండకు గుండు కొట్టి 500 కోట్లతో విలాసవంతమైన భవంతులను నిర్మించుకున్నారని.. ఇన్ని పూర్తి చేయగలిగిన ప్రభుత్వం మెడికల్ కాలేజీలు నిర్మాణానికి మాత్రం ఐదేళ్లు సరిపోలేదని మాట్లాడడం కేవలం విద్యార్థులను మోసం చేయడం మాత్రమే అని సత్యకుమార్ ఆరోపిస్తున్నారు.
వైసిపి పరిపాలన కాలంలో కేవలం పులివెందుల మెడికల్ కాలేజీకి మాత్రమే ఎంతో కొంత పనులు జరిగాయి. మిగిలిన మెడికల్ కాలేజీలకు అనుమతులు వచ్చాయి తప్ప- వాటి నిర్మాణం గురించి జగన్ సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదని గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. మొత్తం 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి 8540 కోట్లు ఖర్చు అవుతుండగా.. కేంద్రం 4950 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం 2300 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన ఖర్చు కేవలం 1451 కోట్లు మాత్రమే. పులివెందుల మెడికల్ కాలేజీ ఒక్కదానికి 500 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా కేవలం 293 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇక్కడ ఆసుపత్రి భవనాలు కట్టారు తప్ప తరగతి గదులు గాని బాలికలకు హాస్టల్ గాని నిర్మించనే లేదు. ఆ కాలేజీలు కూడా 70శాతం టీచింగ్ స్టాఫ్ లేరు. 60 శాతం మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు. కానీ ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి వైద్య కళాశాల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని సత్య కుమార్ ఆరోపిస్తున్నారు. పులివెందుల కాలేజీ మీద అంతో ఇంతో శ్రద్ధ పెడితే ఈ మాత్రం పనులు జరిగాయి. అదే సమయంలో మార్కాపురం మెడికల్ కాలేజీకి 475 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా జగన్ సర్కారు పూర్తి పాలన కాలంలో పెట్టిన ఖర్చు కేవలం 46 కోట్లు మాత్రమే. ఆదోని మెడికల్ కాలేజీ కోసం కేటాయించిన ఖర్చులో 10శాతం కూడా వెచ్చించనే లేదు. పార్వతీపురం మన్యంకి శాంక్షన్ అయిన మెడికల్ కాలేజీకి పైసా విదిలించలేదు. అదేమంటే నాలుగేళ్ల కాలం సరిపోలేదని అంటున్నారని సత్యకుమార్ దెప్పి పొడిచారు. కేవలం 17 నెలల్లో కేంద్రం మంగళగిరిలో 1600 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన ఎయిమ్స్ నిర్మాణాన్ని ఆయన ఉదాహరణగా చూపిస్తున్నారు. మెడికల్ కాలేజీల రంగానికి జగన్మోహన్ రెడ్డి తాను స్వయంగా ఇన్ని ద్రోహాలు చేస్తూ ఇప్పటి ఎన్డీఏ సర్కారు మీద నిందలు వేయడం కేవలం ప్రజలను మోసం చేయడం మాత్రమే అని ఆయన అంటున్నారు. మరి నిందలు వేసి పారిపోవడం అనే ధోరణితో కాకుండా ఈ ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారో చూడాలి.