అంబటి సవాలులాగా జగన్ వాక్కు ఫలిస్తుందా?

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి- ప్రభుత్వానికి, చంద్రబాబునాయుడుకు ఒక సవాలు విసిరారు. తన పార్టీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ లపై అక్రమ కేసులు పెట్టారని, అరెస్టు చేస్తే తన దగ్గర నుంచే మొదలు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వానికి సవాలు విసురుతున్నారు. ‘చంద్రబాబు మోసాలపై ముందు తాను ట్వీట్ చేస్తానని.. తనతో పాటు తన పార్టీ నాయకులు కూడా ట్వీట్లు చేస్తారని ఎంతమందిపై కేసులు పెడతారో పెట్టండి.. ఎంతమందిని అరెస్టు చేస్తారో చూద్దాం..’ అంటూ జగన్ సవాలు విసురుతున్నారు.

సోషల్ మీడియా సైకోల అరెస్టులు, విచారణ ఇన్ని రోజులుగా జోరుగా జరుగుతున్నప్పటికీ.. అసలు అవి ఎందుకు జరుగుతున్నాయో.. ఎలాంటి పోస్టులు పెడుతున్న వారిని పోలీసులు  అరెస్టు చేస్తున్నారో ఈ మాజీ ముఖ్యమంత్రికి కనీసఅవగాహన లేకపోవడమే తమాషా. చంద్రబాబు హామీల విషయంలో మోసం చేశారని, లేదా ప్రజలకు ఇచ్చిన మాట తప్పారని, తీసుకున్న నిర్ణయంలో తప్పు దొర్లిందని పోస్టులు పెడితే అందుకు అరెస్టులు జరుగుతాయనుకోవడం భ్రమ. కేవలం దుష్ప్రచారం మాత్రమే.

చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబసభ్యులు, కుటుంబాల్లోని మహిళల మీద కూడా అత్యంత జుగుప్సాకరమైన రీతిలో  మార్ఫింగ్ పోటోలతో అసహ్యమైన భాషలో పోస్టులు పెడుతున్న వారిని మాత్రమే అరెస్టులు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి తన మీద కూడా సోషల్ మీడియా కేసులు పెట్టించుకోవాలనే ముచ్చట ఉంటే.. అలాంటి తప్పుడు పోస్టులు పెట్టిచూడాలని.. మాజీ ముఖ్యమంత్రి అయినందుకు ఎలాంటి మినహాయింపు ఉండదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదే తరహా సవాలు విసిరి జగన్ అనుచర మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా భంగపడ్డారు. నకరికల్లుకు చెందిన రాజశేఖర రెడ్డి అనే కార్యకర్తపై కేసు నమోదు అయితే.. తన ఇంట్లోనే ఉన్నాడని ఆధారాలుంటే పోలీసులు వచ్చి అరెస్టు చేసుకోవచ్చునని సవాలు విసిరారు. పోలీసులు ఎంచక్కా వెళ్లి ఆధారాలు చూపి అరెస్టు చేసి తీసుకువెళ్లారు. అలాగే జగన్మోహన్ రెడ్డి నోటి వాక్కు కూడా ఫలించి, తథాస్తు దేవతలు ఆశీర్వదించి ఆయన మీద కూడా కేసు నమోదు అవుతుందేమో అనే వాదన ప్రజల్లో ఉంది.

ఇప్పటికే వైఎస్ జగన్ ప్రియమైన తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి సోషల్ మీడియా కేసుల్లో ఇరుక్కునే అవకాశం కనిపిస్తోంది. అవినాష్ రెడ్డి- తన పీఏ రాఘవరెడ్డి చర్చించుకుని పోస్టుల కంటెంట్ తమకు పంపేవారని, అదే తాము పోస్టు చేసేవారమని.. వర్రా రవీందర్ రెడ్డి పోలీసు విచారణలో వెల్లడించిన సంగతి తెలిసిందే. సజ్జల భార్గవ రెడ్డి కూడా పీకల్దాకా ఇరుక్కున్నట్టే. ఇంకొక లెవెల్ విచారణలు పూర్తయ్యేసరికి అసభ్య పోస్టుల వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారో, ఎవరి మార్గదర్శకత్వం ఉన్నదో, డైరెక్షన్ ఉన్నదో బయటకు వస్తుంది. జగన్ పేరు విచారణలో బయటకు వస్తే ఆయన మీద కూడా తప్పకుండా కేసు నమోదు అవుతుందని, ఆయన అందుకోసం ఆరాటపడాల్సిన అవసరం లేదని ప్రజలు అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories