గ్రీన్, బయో ఎనర్జీ విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా 65 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ సంస్థ రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించి సంస్థ ప్రతినిధులు చంద్రబాబు ఎదుట ఎంఓయూపై సంతకాలు కూడా చేశారు. ఈ ఒప్పందం ద్వారా నెలకొల్పే ప్లాంట్లతో రాబోయే అయిదేళ్లలో దాదాపు 2.5 లక్షల మందికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉపాధి అవకాశాలు దొరుకుతాయనేది అంచనా. చంద్రబాబునాయుడు ప్రభుత్వం అయిదేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. ఈ ఒక్క రిలయన్స్ వారి ఒప్పందంతోనే ఏకంగా 12 శాతానికి పైగా లక్ష్యాన్ని అందుకున్నట్టుగా కనిపిస్తోంది.
రాష్ట్రంలో 500 ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి రిలయన్స్ సంస్థ ఈ ఒప్పందం చే సుకుంది. పైలట్ ప్రాజెక్టుగా వాటిని 8 జిల్లాల్లో ఏర్పాటుచేయబోతున్నారు. వచ్చే ఏడాది నవంబరు నాటికి ఉత్పత్తి మొదలవుతుంది. క్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు. ఇంటిగ్రేరటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద ఇచ్చే ప్రోత్సాహకాలన్నీ వీరికి వర్తిస్తాయని చంద్రబాబునాయుడు ప్రకటించారు.
ఇక్కడ గమనించాల్సిన కీలకాంశం ఏంటంటే.. జగన్మోహన్ రె్డి రిలయన్స్ సంస్థ అధిపతుల మెహర్బానీ కోసం వారి కుటుంబాలకు సన్నిహితుడైన పారిశ్రామికవేత్త పరిమల్ ధీరజ్ లాల్ నత్వానీకి 2020లో రాజ్యసభ సభ్యతం కట్టబెట్టారు. పరిమల్ నత్వానీ కి పదవి కట్టబెట్టడంతో.. రిలయన్స్ సంస్థ నుంచి భారీ ప్రాజెక్టులు వస్తాయని ప్రజలు అనుకున్నారు. కానీ వారి ఆశలన్నీ తేలిపోయాయి. జగన్ తన స్వప్రయోజనాలు ఏమైనా నెరవేర్చుకున్నారో లేదో తెలియదు గానీ.. మొత్తానికి వారు కోరిన ఎంపీ పదవిని మాత్రం అప్పనంగా కట్టబెట్టారు. అక్కడికేదో తాను సాధించేసినట్టుగా పరిమల్ నత్వానీని తాడేపల్లికి పిలిపించి.. పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకుని ఆ తర్వాత ఎంపీగా ప్రకటించారు. కానీ ఆయన నుంచి గానీ, రిలయన్స్ సంస్థ నుంచి గానీ.. రాష్ట్రానికి ఒక్క మేలు సాధించలేకపోయారు.
చంద్రబాబునాయుడు అలా కాదు. రాష్ట్రప్రభుత్వం తరఫున ఇప్పటిదాకా వారికి కట్టబెట్టినది, అప్పగించినది ఏమీ లేదు. అయితే 65 వేల కోట్ల రూపాయల భారీ ప్రజెక్టును రిలయన్స్ నుంచి సాధించుకున్నారు. రాష్ట్రంలో రెండున్నరలక్షల మందికి ఉపాధి కల్పించే ప్రాజెక్టు తెచ్చారు.