ఎమ్మెల్యేల గుంజాటన : జగన్ ఈగో కోసం బలి కావాలా?

సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి.  ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. తొలి బడ్జెట్ సమావేశాలు కావడంతో ఎంతో కీలకం కానున్నాయి. అయితే ఈ సమావేశాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ హాజరు కావడం లేదు. సభలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని, ప్రతిపక్ష నేత హోదా లేకుండా ప్రజాసమస్యలను ప్రస్తావించడం సాధ్యం కాదని, సమస్యలను ప్రస్తావించలేనప్పుడు సభకు వెళ్లడం అనవసరం అని జగన్మోహన్ రెడ్డి ఒక పిలకతిరుగుడు కథ చెప్పారు. ఈలెక్కన 11 మంది ఎమ్మెల్యేలు సభకు రావాలంటే.. మొత్తం 11 మందికి కూడా ప్రతిపక్ష నేత హోదా విత్ కేబినెట్ ర్యాంక్ ఇవ్వాలని  ఆయన అడుగుతారో ఏమో తెలియదు. కేవలం 11 మంది ఎమ్మెల్యేల పార్టీ నాయకుడిగా, సాధారణ ఎమ్మెల్యేగా సభలోకి వెళ్లడం జగన్ తన ఈగోకు దెబ్బగా భావిస్తున్నారనేది స్పష్టం.

అయితే సరిగ్గా ఈ అంశం మీదనే ఇప్పుడు పార్టీలో మల్లగుల్లాలు నడుస్తున్నాయి. ఎమ్మెల్యేలు తీవ్రంగా తర్జన భర్జన పడుతున్నారు. జగన్ అహంకారాన్ని సంతృప్తి పరచడం కోసం తామందరమూ తమ తమ రాజకీయ జీవితాన్ని బలి చేసుకోవాలా? అని ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు. తమ తమ నియోజకవర్గ ప్రజలు తమను ఎమ్మెల్యేగా గెలిపించిన తరువాత.. తాము కనీసం అసెంబ్లీ సమావేశాలకు కూడా వెళ్లకపోతే నియోజకవర్గంలో చెడ్డపేరు వస్తుంది కదా అని మధన పడుతున్నారు. గెలిచినందుకు కనీసం సభకు కూడా వెళ్లకపోతే.. ప్రజలు అసహ్యించుకుంటారని, తర్వాత మళ్లీ ప్రజల వద్దకు ఓట్లకోసం వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇలాంటివి ప్రభావం చూపిస్తాయని వారు  భయపడుతున్నారు.

ప్రజాసమస్యలు లేవనెత్తాలంటే ప్రతిపక్షనేత హోదా లేకపోతే తప్ప సాధ్యం కాదు కదా అని జగన్ చెబుతున్న వాదన ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలకే కామెడీగా కనిపిస్తోంది. ఒకవేళ అలాంటి వాదన నిజమే అని అనుకున్నప్పటికీ.. అలాంటి హోదా దక్కేది ఆయన ఒక్కరికే కదా.. మరి మేమందరమూ ఎప్పటికీ సభకు వెళ్లకుండానే ఉండాలా? సభానాయకుడు, ప్రతిపక్ష నాయకుడు సహజంగా ఇద్దరే ఉంటే.. ఇక మిగిలిన 173 మంది సభకు రాకుండానే గడపాలా? అనే ప్రశ్నలు వారిలోనే వస్తున్నాయి. జగన్ అహంకారం కోసం సభకు వెళ్లకుండా ఉంటే పరువు పోయేది తమకే కదా అని వారు ఆందోళన చెందుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories