ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు సోమవారం మొదలు కానున్నాయి. దీనికి సంబంధించి.. మంత్రి పయ్యావుల్ కేశవ్ గవర్నరు అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిసి సమాచారం తెలియజేశారు. ఈ సమావేశాలకు అసెంబ్లీకి మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు హాజరు కావడం లేదు. తనకు ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వలేదు గనుక.. అసెంబ్లీకి వెళ్లబోయేది లేదని జగన్ ఆల్రెడీ ప్రకటించారు. కాకపోతే ఆయన పార్టీ ఎమ్మెల్సీలు మాత్రం శాసన మండలికి హాజరు కాబోతున్నారు. ఇక పోతే.. ఈ శాసనసభ సమావేశాల ద్వారా- గత రెండు మూడు నెలలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్న ఒక మేజర్ అంశంలో ఆయన నోరు మూయించబోతోంది చంద్రబాబునాయుడు ప్రభుత్వం! అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతోంది.
ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదని, అసలు ప్రభుత్వానికి బడ్జెట్ ప్రవేశపెట్టే సత్తా కూడా లేదని.. బడ్జెట్ ప్రవేశపెడితే గనుక.. చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలు ఇతర పథకాలకు సంబంధించి నిధుల కేటాయింపును బడ్జెట్ లో చూపించాల్సి వస్తుందని.. అసలు ప్రభుత్వం వద్ద డబ్బులే లేవు గనుక చూపించలేరని.. చంద్రబాబు హామీ ఇచ్చిన పథకాలన్నీ డొల్ల అని తేలిపోతుందని జగన్మోహన్ రెడ్డి రెండు మూడు నెలలుగా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. చంద్రబాబునాయుడు సర్కారు అసలు బడ్జెట్ పెట్టనే పెట్టదు అనే నమ్మకం ఉన్నట్టుగా జగన్ విపరీతంగా చెలరేగిపోయి మాట్లాడారు. బడ్జెట్ పెట్టకపోవడం ప్రభుత్వ వైఫల్యం అంటూ నిందలు వేశారు.
ఇప్పుడు ఆయన ఆశలు అడియాసలు కానున్నాయి. చంద్రబాబు సర్కారు బడ్జెట్ పెట్టబోతోంది. సోమవారం ఉదయం తొమ్మిది గంటలకే శాసనసభలోని సీఎం కార్యాలయంలో మంత్రి మండలి బడ్జెట్ ను ఆమోదిస్తుంది. అసెంబ్లీ సెషన్స్ మొదలు కాగానే. .ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆ పర్వం ముగిసిన వెంటనే సభ మంగళవారానికి వాయిదా పడుతుంది. 10 లేదా 11 రోజుల పాటు నిర్వహించే అసెంబ్లీ షెడ్యూలును ఖరారు చేయడానికి బీఏసీ సమావేశం కూడా జరుగుతుంది.
అయితే పాపం బడ్జెట్ పెట్టరు అనుకున్న జగన్.. చెలరేగిపోయి నిందలు వేస్తే.. ఇప్పుడు ఆయన నోరు మూయించేలా సర్కారు బడ్జెట్ పెడుతుండడం గమనార్హం.