తిరుమల తిరుపతి దేవస్థానాల అధ్యక్షుడిగా ఇప్పుడు కొత్త శకం ప్రారంభం అయింది. చిత్తూరు జిల్లాకే చెందిన బిఆర్ నాయుడు ఛైర్మన్ గా పదవిని స్వీకరించారు. అయిదేళ్లలో హిందూ ధర్మానికే తలవంపులు తెచ్చేలాగా అనేక విధాలుగా దారితప్పిపోయిన టీటీడీ పరిపాలనను తిరిగి దారిలోకి తీసుకురావడం అనేది బిఆర్ నాయుడు ముందున్న తక్షణ కరన్తవ్యంగా ప్రజలు భావిస్తున్నారు. ఈ రకంగా చూసినప్పుడు ఆయన మీద గురుతర బాధ్యత ఉన్నదని అంటున్నారు. టీటీడీ సమూల ప్రక్షాళన జరగాలని కూడా ఆశిస్తున్నారు.
అయిదేళ్లు జగన్ పాలనలో.. ధార్మిక చింతన కంటె, తిరుమలేశుని పట్ల భక్తి కంటె జగన్ పట్ల భక్తి ఎక్కువగా ఉండే నాయకుల పాలన నడిచింది. వారు తిరుమలను ఒక దుకాణంగా మార్చేశారు. తమ అక్రమార్జనలకు, దందాలకు కేంద్రబిందువుగా వాడుకున్నారు. వైవీసుబ్బారెడ్డి అనేక రకాలుగా భ్రష్టు పట్టిస్తే ఆ తర్వాత అధ్యక్షుడు అయిన భూమన కరుణాకర్ రెడ్డి భ్రష్టు పట్టించడాన్ని తారస్థాయికి తీసుకెళ్లారు. టీటీడీ సొమ్మును జగన్ సర్కారుకు దోచిపెట్టడానికి ప్రణాళికలు చేశారు. ఇలాంటి అనేక వక్రాచారాలు చోటుచేసుకున్నాయి.
ఇప్పుడు బిఆర్ నాయుడు పాలన మొదలైంది. టీటీడీ వ్యవహారాలను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నది. ఆ స్పృహతోనే ఆయన ఆ పదవిని అందుకున్నారు. స్వయంగా మీడియా సంస్థ అధినేత గనుక.. టీటీడీలో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో.. బాహ్యప్రపంచానికి తెలిసిన వాటికంటె ఆయనకు ఎక్కువగానే తెలిసే అవకాశం ఉంది. వాటన్నింటినీ కూడా చక్కదిద్దవలసిన బాధ్యత ఆయన మీద ఉన్నదని పలువురు కోరుకుంటున్నారు. ఆయన కూడా తన పేరును ఛైర్మన్ గా ప్రకటించిన తర్వాత.. ఇదే విషయం చెప్పారు. టీటీడీని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉన్నదని అన్నారు.
అలాగే టీటీడీలో అన్యమతస్తులు ఉద్యోగాలు చేయడం మీద కూడా బిఆర్ నాయుడుకు స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. హిందూ ధార్మిక సంస్థలో ఇతరులు ఎందుకు ఉద్యోగులుగా ఉండాలి అని ఆయనే ప్రశ్నిస్తున్నారు. ఆయన పరిపాలన సాగే రెండేళ్ల కాలంలో.. ఇలాంటి అరాచక పోకడల పరంగా అనేక కీలక నిర్ణయాలు వస్తాయని అందరూ అనుకుంటున్నారు. ఆ రకంగా బిఆర్ నాయుడుపై తిరుమల దేవుడి బాధ్యత ఎక్కువగానే ఉన్నది.