తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నందుకు అలిగిన కమల నాయకులు కూడా ఇప్పుడిప్పుడే పరిస్థితిని అర్థం చేసుకుని దార్లోకి వస్తున్నారు. ఈ బంధం ఇప్పటితో ముగిసిపోయేది కాదని అందరికీ అర్థమవుతోంది. అటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గానీ, ఇటు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గానీ.. ఎన్డీయే పొత్తు బంధం ఎప్పటికీ పదిలంగా ఉంటుంది అనే మాటలే చెబుతున్నారు. పొత్తు బంధానికి హాని చేసేట్లయితే సొంత పార్టీ నాయకులనైనా వదలుకుంటాం గానీ, పొత్తుబంధాన్ని వదలుకునేది లేదని పార్టీల నాయకులు స్పష్టంగా తమ కేడర్ కు సంకేతాలు పంపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఎన్డీయే కూటమిగా ఈ మూడు పార్టీలు ఏర్పడినప్పుడు అసంతృప్తి వ్యక్తంచేసిన సీనియర్ నేతలు, అప్పట్లో అలిగిన వారు ఇప్పుడు దార్లోకి వస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం భేషుగ్గా పనిచేస్తున్నదని కితాబులు ఇస్తున్నారు.
ఎన్డీయేలోకి తెలుగుదేశాన్ని కూడా భాగస్వామిగా తీసుకోవాలా? లేదా? అనే చర్చ 2024 ఎన్నికలకు పూర్వం జరిగినప్పుడు.. కమలదళంలోని కొందరు కీలక నాయకులు గట్టిగా వ్యతిరేకించారు. తెలుగుదేశంతో బంధం వద్దే వద్దని అన్నారు. అలాంటి వారిలో బిజెపికి పూర్వం రాష్ట్ర అధ్యక్షుడుగా కూడా పనిచేసిన సోము వీర్రాజు కూడా ఉన్నారు. ఆయనతో పాటు విష్ణువర్ధన్ రెడ్డి లాంటి మరికొందరు నాయకులు కూడా తెలుగుదేశంతో పొత్తును వ్యతిరేకించారు. నిజానికి వారి మీద జగన్ అనుకూల బిజెపి నాయకులు అనే ముద్ర కూడా ఉంది. సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడిగా తన పదవీకాలంలో జగన్ పట్ల సుతిమెత్తటి వైఖరి అవలంబించారని, జగన్ ఏ పాట పాడమంటే ఆ పాట పాడారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో సోము వీర్రాజు పొత్తును గట్టిగా వద్దని అన్నారు. అందుకే అంత సీనియర్ నాయకులు అయి ఉండి కూడా వారు ఎన్నికల్లో టికెట్ ఆశించలేదు. ఎన్నికల్లో ప్రచార పర్వానికి కూడా చాలావరకు దూరంగా ఉన్నారు.
అలాంటి సోము వీర్రాజు ఇప్పుడు చంద్రబాబునాయుడు పరిపాలనను ప్రశంసిస్తున్నారు. బాబు పాలన భేషుగ్గా ఉందని అంటున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంవైపు నడిపిస్తున్నారని సోము వీర్రాజు అంటుండడం విశేషం. అధికారంలోకి వచ్చిన వెంటనే పించను పెంచాం, ఇప్పుడు ఉచిత సిలిండరు పథకం తీసుకువచ్చాం. అంచెలంచెలుగా ప్రతి హామీని అమలుచేస్తాం అంటూ ఆయన ప్రభుత్వాన్ని వెనకేసుకు వస్తున్నారు.
మూడు పార్టీల పొత్తుబంధం మరింత పదిలంగా మరింత కాలం కొనసాగడానికి సోము వీర్రాజు లాంటి నాయకుల్లో వచ్చిన మార్పు మంచి సంకేతంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.