నెలరోజుల్లోగా పోలీసు శాఖను ప్రక్షాళన చేసేస్తామని జగన్ భక్తులతో నిండిపోయి ఉన్న పోలీసు యంత్రాంగాన్ని తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఒకవైపు పవన్ కల్యాణ్ పోలీసుల జగన్ భక్త ధోరణుల మీద నిప్పులు చెరగుతూ.. తానుగనుక హోంశాఖ తీసుకుంటే మీ సంగతి చెబుతా అన్నట్లుగా హెచ్చరిస్తున్నారు. మరోవైపు హోంమంత్రి వంగలపూడి అనిత సోషల్ మీడియా ట్రోలింగులకు గురవుతున్న వారిలో తాను కూడా ఉన్నానని, పోలీసుల అచేతనత్వాన్ని ఇండైరక్టుగా బయటపెడుతూ కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇన్ని జరుగుతున్నప్పటికీ.. కొందరు పోలీసుల్లో మాత్రం ‘జగన్ భక్తి’ అలాగే ఉంటోంది. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టుగా పోలీసులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుతం పోలీసు కన్టడీలో ఉండి విచారణ ఎదుర్కొంటున్న నిందితుడు, రౌడీషీటరు బోరుగడ్డ అనిల్ కు పోలీసులు విందుభోజనం ఏర్పాటు చేయడం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. విధుల్లో నిర్లక్ష్యం కాదు కదా.. జగన్ భక్తిని పుష్కలంగా కలిగి ఉన్న ఏడుగురు పోలీసుల మీద సస్పెన్షన్ వేటు పడింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రౌడీషీటరు బోరుగడ్డ అనిల్ అనేక కేసుల్లో నిందితుడు. వైసీపీ కాలంలో ఇష్టారాజ్యంగా చెలరేగాడు. చర్చి పాస్టర్లను బెదిరించి డబ్బు వసూలు చేసేవాడు. ఆ రీతిగా ఒక చర్చి పాస్టర్ ను కత్తిచూపి బెదిరించి డబ్బు డిమాండ్ చేసినందుకు అతనిపై కేసు నమోదు అయింది. అది ప్రభుత్వం మారిన తర్వాత గానీ విచారణకు రాలేదు. చాలాకాలం పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరిగినా చివరికి అరెస్టు చేశారు. ఇతను ఒక రౌడీషీటరు అయినప్పటికీ జగన్ పాలనలో.. గన్ మెన్ ను కలిగి ఉండేవాడు. ఆవిషయం విచారణలో పోలీసులు అడిగితే.. తాను జగన్ కు సలహాదారుగా ఉండేవాడినని, అందుకే తనకు గన్ మెన్ ఇచ్చారని చెప్పడం విశేషం.
అలాంటి బోరుగడ్డ అనిల్ ను ఒక కేసు నిమిత్తం మంగళగిరి కోర్టులో హాజరుపరచిన తరువాత.. తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకువెళుతూ పోలీసులు మార్గమధ్యంలో అతనికి విందుభోజనం ఏర్పాటుచేశారు. గన్నవరం క్రాస్ రోడ్స్ రెస్టారెంట్ లో రాచమర్యాదలు చేశారు. అక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు సెల్ ఫోన్లో వీడియో చేస్తుండగా పోలీసులు వాళ్ల ఫోన్ లాక్కుని వీడియో డిలిట్ చేశారు. కానీ సీసీ టీవీ ఫుటేజీ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చాయి. పోలీసుల అతి వేషాలు విమర్శల పాలవుతున్నాయి. ఈ సంఘటనలో ఏడుగురిని సస్పెండ్ చేసి ఉండచ్చు. కానీ పోలీసు శాఖను ప్రక్షాళన చేయడం అంటే.. ఇలాంటి జగన్ భక్తులను ఏరివేయడం ఎప్పటికి సాధ్యం అని అంతా అనుకుంటున్నారు.