ఒకవైపు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చప్పుడు చేయడం లేదు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ప్రచార పర్వంలోకి కూడా దిగేసింది. పట్టభద్ర ఎన్నికల విషయంలో.. సైలెంట్ గా ఉంటున్న వైసిపి, విజయనగరం స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగుతున్నదని అనుకుంటున్న వేళ హడావుడి మొదలుపెట్టేశారు. ఆ సీటు తమకు కచ్చితంగా దక్కుతుందని వైసిపి నాయకులు ఆశ పడుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా వాళ్ళంతా ఎమ్మెల్సీ పదవి దక్కించుకోవాలని ఆశ పడుతున్నారు.
పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే జనం మన్నన ఉండాలి. జనంలో ఆదరణ ఉండాలి. జనం ఓట్లు వేయాలి. అదికూడా చదువుకున్న వాళ్ళు. రాష్ట్రంలో చదువుకున్న వర్గం తమకు ఓట్లు వేస్తారనే నమ్మకం వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు లేదు. జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి లాంటి వారు మాత్రం రాష్ట్రంలో ఈ క్షణం ఎన్నికలు వచ్చినా సరే.. వైసిపి ఘనమైన మెజారిటీ తో గెలుస్తుందని.. చంద్రబాబు పాలన పట్ల ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసిందని ఊదరగొడుతుంటారు. కానీ, కనీసం పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా వారికి ధైర్యం చాలదు. ఇలాంటి బుకాయింపు మాటలతోనే రోజులు నెట్టుకొస్తున్నారు.
విజయనగరం స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ నెల 28న ఈ స్థానానికి ఎన్నిక జరుగుతుంది. అయితే ఈ టికెట్ దక్కించుకోవడానికి చాలా మంది వైసీపీ నేతలు పోటీపడుతున్నారు. స్థానిక సంస్థల ప్రతినిధుల ఓట్లు మొత్తం 743 ఉండగా, అందులో 543 మంది వైసీపీ వారే కావడం గమనార్హం. టీడీపీ బలం 155 మంది. 22 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. కాగా, వైసీపీ లోని పలువురు స్థానిక ప్రతినిధులు ఎన్డీయే కూటమి పార్టీల పట్ల మొగ్గుతున్నారు. మొత్తానికి సమీకరణాలు ఇలా ఉన్నాయి.
పార్టీకి కాస్త బలం కనిపిస్తుండేసరికి చాలా మంది ఎగబడుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు బడుకొండ అప్పలనాయుడు, శంబంగి చినఅప్పల నాయుడు, పాముల పుష్పశ్రీవాణి,కోలగట్ల వీరభద్రస్వామి ఉన్నారు. ఓడిపోయిన బొత్సకు ఒక అవకాశం దక్కగా లేనిది.. తమకు కూడా చాన్స్ కావాలని అడుగుతున్నారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన వారికి వద్దు.. పార్టీకోసం పనిచేసే ఇతర సీనియర్లకు ఇవ్వాలనే వాదన ఉంది. మొత్తానికి పట్టభద్ర ఎన్నిక విషయంలో పార్టీ ని ఎవరూ పట్టించుకోలేదు గానీ.. దీనికి మాత్రం ఎగబడుతున్న చిత్రమైన వాతావరణం కనిపిస్తోంది.