వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఏర్పడిన అన్న చెల్లెళ్ల తగాదాను వాడుకుంటూ.. వీలైనంతగా భ్రష్టు పట్టించడానికి పచ్చదళాలు చేస్తున్న కుటిల ప్రయత్నాలకు వైఎస్సార్ సతీమణి విజయమ్మ డైరెక్ట్ ఎటాక్ ఇచ్చారు. ఎలాంటి శషబిషలకు తావులేకుండా ఈసారి ఆమె వీడియో సందేశం విడుదల చేశారు. తమ కుటుంబంలో ఉన్న వివాదాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని చూడడాన్ని ఆమె తప్పుపట్టారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారం బాధ కలిగిస్తోందని విజయమ్మ పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్న పచ్చదళాల మీద నేరుగానే విజయమ్మ విరుచుకుపడడం విశేషం.
‘కుటుంబంలో భిన్నాభిప్రాయాలు ఉండొచు. అయినంత మాత్రాన తల్లికి కొడుకు కాకుండా పోతాడా? కొడుక్కి అమ్మ కాకుండా పోతుందా? ఓ అన్నకు చెల్లి కాకుండా పోతుందా? చెల్లికి అన్న కాకుండా పోతాడా?’ అంటూ విజయమ్మ తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. ‘మా పిల్లల్ని చాలా సంస్కారవంతంగా పెంచాం.. మిమ్మల్ని అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనాల కోసం ఇంతగా దిగజారుతారా? రెండేళ్ల కిందట జరిగిన నా కారు ప్రమాదానికి నా కుమారుడు జగన్ కు ముడిపెడుతున్నారు..’ అంటూ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
విజయమ్మ కారుకు జరిగిన ప్రమాదం ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెలుగుదేశం పార్టీ చవకబారు ప్రచారానికి పాల్పడింది. కారు టైర్లు ఊడిపోయేలా, ఆమెకు ప్రాణాపాయం కలిగేలా జగన్మోహన్ రెడ్డి కుట్ర చేయించారు.. అని అర్థం వచ్చేలాగా పోస్టు పెట్టారు. తల్లిని చంపించడానికి కొడుకు ప్రయత్నించాడు.. అనే తరహాలో నీచమైన ప్రచారానికి ఒడిగట్టారు. దీనిపై ఆవేదనకు గురైన విజయమ్మ వీడియో సందేశం విడుదల చేయడం విశేషం. ‘నా కొడుకు, నా కూతురు, నా మనవలు అందరినీ కలిపి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు’ అంటూ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకరి కుటుంబ తగాదా గురించి ఇతరులు మాట్లాడడమే చవకబారు వ్యవహారం. అందులోనూ శృతిమించి.. పచ్చదళాలు వ్యవహరిస్తున్న తీరు. సామాన్య ప్రజలకు కూడా వెగటు పుట్టిస్తోంది.