అన్నాచెల్లీ కొట్టుకుంటున్నది దోచుకున్న సొత్తుకోసమేనా?

సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్.. ఇటీవలి కాలంలో బాగా వార్తల్లో నలుగుతున్న పేరు. ఈ కంపెనీ పుట్టి దాదాపుగా రెండు దశాబ్దాలు గడచింది. కంపెనీ స్థాపన మరియు విస్తరణ కోసం దాదాపు పదిహేనువందల ఎకరాలు సేకరించింది. ప్రభుత్వం నుంచి గనుల తవ్వకాలకు కూడా రెండు  విడతలుగా ఎనభయ్యేళ్ల కాలానికి లీజు అనుమతులు పొందింది. అయినా ఇప్పటిదాకా కార్యకలాపాలు ప్రారంభమే కాలేదు. ఇంతకీ ఆ కంపెనీ మూలాలు సక్రమంగానే ఉన్నాయనే భరోసా కూడా లేదు. రైతులను బెదిరించి వారినుంచి భూములు కొన్నారని ఇవాళ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొత్త విషయాన్ని బయటపెట్టారు.

ప్రజలను బెదిరించి వారి ఆస్తులను లాక్కొని, తమ సొంత ఆస్తిలా భావించి జగన్ కుటుంబ సభ్యులు కొట్లాడుకుంటున్నారంటూ పవన్ కల్యాణ్ అన్నాచెల్లెళ్ల ఆస్తుల పోరాటం గురించి ఘాటైన విమర్శలు చేశారు. వైకాపా నాయకులు ఇంకా తామే అధికారంలో ఉన్నట్టుగా భ్రమల్లో బతుకుతున్నారని పవన్ అన్నారు. సరస్వతీ పవర్ కోసం జగన్ తన తండ్రి వైఎస్సార్ అధికారంలో ఉండగా కొన్ని భూములను సొంతంగా కొన్నారని వైఎస్ ప్రభుత్వం ముప్పయ్యేళ్ల లీజులకు భూములు ఇస్తే.. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో యాభయ్యేళ్ల లీజులు పొడిగించిందంటూ వారి పన్నాగాలను ఆయన బయటపెట్టారు. ఇక్కడ ప్రజలకు ఉద్యోగాలు ఆశ చూపించి బలవంతంగా భూములు తీసుకున్నారని.. ఇప్పటిదాకా ప్లాంటు ప్రారంభమే కాలేదని పవన్ చెప్పుకొచ్చారు.

సరస్వతీ పవర్ పేరిట ఉన్న భూముల్లో ఎన్ని అక్రమాలు ఉన్నాయో కూడా ఆయన బయటపెట్టడం విశేషం. వీరి కబ్జాలో సహజవనరులు, కొండలు, వాగులు ఉన్న భూములు కూడా ఉన్నాయని.. అవన్నీ వారి ఆస్తులుగా ఎలా మారాయో విచారణ జరిపిస్తున్నామని పవన్ చెప్పారు. వీటన్నింటినీ మించి ఏకంగా 400 ఎగరాల అటవీభూములను రెవెన్యూ భూములుగా మార్చేసి సరస్వతీ పవర్ కోసం లాక్కున్నారని స్థానికులు చెబుతున్నారని పవన్ పేర్కొనడం గమనార్హం. అటవీ భూముల విషయంలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి.

చూడబోతే.. ఇలా అడ్డగోలుగా లాక్కున్న భూములకోసం అన్నా చెల్లెళ్లు పెద్దస్థాయిలో గొడవపడుతున్నట్టుగా కనిపిస్తోంది.
భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ పేర్కొనడాన్ని గమనిస్తే, త్వరలోనే సరస్వతీ పవర్ కు గత ప్రభుత్వాలు ఇచ్చిన లీజులు రద్దవుతాయనే సంకేతాలు ప్రజలకు అందుతున్నాయి. 

Related Posts

Comments

spot_img

Recent Stories