పొత్తు బంధంపై ఆ కమిట్‌మెంట్ చాలా మంచిది!

రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్డీయే కూటమి ప్రభుత్వం నడుస్తోంది. తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీలు కలిసి కూటమిగా పనిచేస్తున్నాయి. కూటమి అధికారంలో ఉన్నది గనుక.. ఆధిపత్యం చెలాయించే విషయంలో ఈ మూడు పార్టీల స్థానిక నేతల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, పొరపొచ్చాలు లోకల్ గా వస్తుండడం సహజం. చెదురుమదురుగా కొన్నిచోట్ల కూటమి పార్టీల స్థానిక నేతల మధ్య విభేదాలు తగాదాలుగా ముదురుతున్నాయి కూడా! అయితే ఇవన్నీ కూడా టీకప్పులో తుపాను లాంటి వ్యవహారాలు మాత్రమే. కాగా, కూటమి బంధం గురించి మంత్రి నిమ్మల రామానాయుడు తాజాగా ప్రకటించిన మాటలు మాత్రం గొప్ప నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. కూటమి బంధం గురించి ఆ మాత్రం కమిట్మెంట్ ఉండడం చాలా మేలు చేస్తుందని కార్యకర్తలు అనుకుంటున్నారు.

కర్నూలులో మూడు పార్టీల సమన్వయ సమావేశానికి మంత్రి నిమ్మల హాజరయ్యారు. నియోజకవర్గాలలో మూడు పార్టీల నాయకుల మధ్య తలెత్తుతున్న సమస్యల గురించి ఆయన మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో పొత్తు ధర్మం ఎలా కొనసాగుతున్నదో.. అదే ధర్మాన్ని నియోజకవర్గాల్లో నాయకులు కూడా అనుసరించి తీరాల్సిందేనని నిమ్మల ప్రకటించారు. పొత్తుకు ఇబ్బంది కలిగించే నాయకులు తమ పార్టీల్లో ఉంటే.. ఆ నాయకుల్ని వదులుకోవడానికి కూడా సిద్ధంగానే ఉంటాం గానీ.. పొత్తును మాత్రం వదులుకునే అవకాశం లేదని నిమ్మల ప్రకటించారు. 

చంద్రబాబునాయుడు జైల్లో ఉన్న సమయంలో వచ్చి పరామర్శించిన పవన్ కల్యాణ్ ఆ సందర్భంలోనే పొత్తును ప్రకటించారని,  ఈ పొత్తు ముప్పై ఏళ్లకు పైగా కొనసాగేలా మూడు పార్టీల అధినేతలు పక్కా ప్రణాళిక, సమన్వయంతో ముందుకు వెళుతున్నారని నిమ్మల పేర్కొన్నారు. 

ఈ ఎన్నికల్లో కూటమి సాధించిన 93 శాతం స్టైక్ రేట్ ను ఎప్పటికీ కొనసాగించడమే లక్ష్యంగా మూడు పార్టీల కార్యకర్తలందరూ పనిచేయాలని ఆయన సూచించారు. నిమ్మల మాటలు పొత్తు బంధానికి ఊతమిచ్చే విధంగానే ఉన్నాయి. పార్టీల మధ్య పొత్తులు ఉన్నప్పుడు.. స్థానికంగా నియోజకవర్గాల్లో కొందరు నాయకుల మధ్య పొరపొచ్చాలు సహజమే గానీ.. ఇప్పుడు అనివార్యంగా సర్దుబాటు ధోరణి అవలంబించాల్సిందే అని నిమ్మల తేల్చేసినట్టు అయింది. 

స్థానిక నాయకులు కూడా పొత్తు బంధం యొక్క సరైన స్ఫూర్తిని అర్థం చేసుకుని పనిచేస్తే అందరికీ మేలు జరుగుతుందని, అలాకాకుండా ఇదే తరహాలో విభేదాలతో సాగాలనుకుంటే అందరూ నష్టపోతారని కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories