‘తమ పార్టీ వారిపై కేసులు రిజిస్టరు కావాలి.. తమ పార్టీ వారిని లెక్కకు మిక్కిలిగా అరెస్టు చేసి పోలీసులు వారిని జైళ్లలో పెట్టాలి.. కార్యకర్తలందరూ వందల వేల సంఖ్యలో జైళ్లలో మగ్గాలి లేదా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాలి..’ ఇలాంటి లక్ష్యాలతో ఏ రాజకీయ పార్టీ అయినా పనిచేస్తుందా? తమ కార్యకర్తలను కేసుల్లో ఇరికించడానికి తాపత్రయపడుతుందా? ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధోరణి గమనిస్తే మాత్రం అలాగే కనిపిస్తోంది.
తమ పార్టీకి చెందిన కార్యకర్తల మీద ఎన్ని ఎక్కువ కేసులు నమోదు అయితే తమకు అంతగా పొలిటికల్ ఎడ్వాంటేజీ వస్తుందని వారు భ్రమపడుతున్నట్టుగా తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి.. తమ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలతో మాట్లాడుతూ.. మీమీద ఎలాంటి కేసులు నమోదు అయినా పార్టీ చూసుకుంటుంది. లీగల్ సెల్ మీ కేసుల గురించి పనిచేస్తుంది. ఒక టీమ్ మీకు లీగల్ సలహాలు చెబుతుంది.. అంటున్నారే తప్ప.. అసలు కేసులు నమోదుకాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో మాత్రం వారికి చెప్పడం లేదు!
తెలుగుదేశం పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం తమ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. తమ కార్యకర్తలంతా పరిశుద్ధులని, వారిమీద ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తున్నదని అర్థం వచ్చేలా జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసి వారికి మద్దతు తెలియజేశారు. సజ్జల రామక్రిష్ణారెడ్డి టీమ్ తో టెలికాన్ఫరెన్స్ పెట్టుకుని.. వారందరినీ మరింతగా రెచ్చిపోమన్నట్టుగా ధ్వనిస్తూ ధైర్యం చెబుతున్నారు.
సోషల్ మీడియా కార్యకర్తలకు పార్టీ లీగల్ సెల్ అండగా నిలుస్తుంది. ఎవ్వరి మీద కేసులు పెట్టినా నియోజకవర్గంలోని నాయకులు వెంటనే స్పందించండి. వారికి లీగల్ సహాయం ఏర్పాటుచేయండి. ఎక్కడికక్కడ సమన్వయ కమిటీలు పెట్టుకోండి అంటూ సజ్జల నేతలకు డైరెక్షన్ చేస్తున్నారు. అరెస్టు అవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయసలహాలు అందించడం కోసం పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ అడ్వకేట్స్ తో ఒక కంట్రోల్ రూం కూడా ఏర్పాటుచేస్తున్నారట.
వారు 24×7 అందరికీ అందుబాటులో ఉంటూ లీగల్ సలహాలు చెబుతుంటారట. కేసులకోసం ఒక పర్మినెంట్ ఆఫీసు సెటప్ ఏర్పాటు చేసుకుంటున్న సజ్జల రామక్రిష్ణారెడ్డి వ్యవహారం గమనిస్తే.. రాబోయే అయిదేళ్ల పాటూ మరిన్ని వేల లక్షల కేసులు రిజిస్టరు అయ్యేలా సోషల్ మీడియాను ప్రేరేపిస్తున్నట్టే, వారితో పనిచేయించాలని అనుకుంటున్నట్టే ఉన్నదని పలువురు భావిస్తున్నారు. మొత్తానికి మేం చూసుకుంటాం.. మీరు రెచ్చిపోండి.. అనేతరహా మాటల ద్వారా పార్టీని నమ్ముకున్న సోషల్ మీడియా కార్యకర్తల్ని కేసుల ఊబిలోకి పూర్తిగా దించేయడానికి సజ్జల కంకణం కట్టుకున్నట్టున్నారని పార్టీ వారే వ్యాఖ్యానిస్తున్నారు.