చంద్రబాబుగారే చేతులెత్తేశారంటే..

ఒక నాయకుడి యొక్క సమర్థత అన్ని పరిస్థితులూ సవ్యంగా సాగుతూ ఉన్నప్పుడు కాదు.. సంక్లిష్టతలు ఎదురైనప్పుడు మాత్రమే బయటకు వస్తుంది. క్రైసిస్ సమయంలో మేనేజ్ చేయడమే అసలైన సమర్థత కింద లెక్క. ఆ రకంగా చూసినప్పుడు చంద్రబాబునాయుడు తన కార్యకుశలతను సమర్థతను వందల వేల సందర్భాల్లో నిరూపించుకుని ఉంటారు. అలాంటి నాయకుడికి కూడా పరిష్కారం బోధపడని సమస్య వచ్చిందంటే అది ఎంత పె ద్ద సమస్య అయి ఉంటుందో కదా! ఇప్పుడు అలాంటి పరిస్థితే వచ్చింది. విశాఖపట్టణంలో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మించిన ఋషికొండ భవనాలను స్వయంగా గమనించిన తర్వాత, ఆ స్థాయిలో నిర్మించిన భవనాలను ఏం చేసుకోవాలో తెలియక చంద్రబాబునాయుడుకే పాలుపోని పరిస్థితి ఏర్పడిందంటే.. జగన్ చేతుల మీదుగా ఎలాంటి ఘనకార్యం జరిగిందో అర్థమవుతుంది.

విశాఖ రుషికొండను బోడి కొట్టేసి.. జగన్ తన నివాసం కోసం అత్యంత విలాసవంతమైన భవంతులను ప్రభుత్వం ఖర్చుతో నిర్మించుకున్న సంగతి ప్రజలందరికీ తెలిసిందే. ఏపీ టూరిజం శాఖకు అత్యాధునిక గెస్టు హౌస్ లు ఉండాలనే ఉద్దేశంతోనే వీటిని నిర్మిస్తున్నట్టు వాటి చుట్టూ వివాదం రేగినంత కాలమూ కోర్టులను, ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తూ వచ్చారు. విశాఖకు సెలబ్రిటీ వీఐపీ స్థాయి అతిథులు వచ్చినప్పుడు వారు బస చేయడం కోసం చేస్తున్న ఏర్పాట్లు అని మోసం చేశారు. నిజానికి ఈ రాష్ట్రానికి తాను శాశ్వతంగా ముఖ్యమంత్రిగానే ఉండిపోతానని కలకన్న జగన్మోహన్ రెడ్డి, తన కోసమూ మరియు తన ఇద్దరు కూతుళ్ల కోసమూ నిర్మించుకున్న భవంతులు అవి. వాటిని వివాదం సాగుతున్న అయిదేళ్లలో వెళ్లి చూడాలని అనుకుంటే చంద్రబాబునాయుడుకు కూడా అనుమతి దొరకలేదు. తాజాగా వాటిని ముఖ్యమంత్రి స్థాయిలో పరిశీలించిన చంద్రబాబు.. నివ్వెరపోయారు. ఒక దుర్మార్గుడు ప్రభుత్వాధినేత అయితే.. ప్రజల సొమ్ముతో ఇంత దారుణాలు చేయగలరా? అని నివ్వెరపోతున్నారు. బాత్ టబ్ కోసం ఏకంగా 36 లక్షలు ఖర్చు చేశారట. ఫ్యాన్సీ ఫ్యాన్లు, కళ్లు చెదిరే షాండ్లియర్లు పెట్టారట. ఇంత అతి విలాసవంతమైన భవంతులను ఇప్పుడు ఎలాంటి అవసరాల కోసం వాడుకోవాలో తనకే అర్థం కావడం లేదని చంద్రబాబు చెప్పారు.

చంద్రబాబుకే పరిష్కారం తోచలేదంటే.. అది ఏ స్థాయిలో ఉన్నదో ఊహించుకోవచ్చు. ఉత్తరాంధ్రలోని అన్ని ప్రాజెక్టులకు కలిపి కూడా ప్రభుత్వం 400 కోట్లు ఖర్చు చేయలేదని, ఈ జగన్ విలాసాల కోసం 600 కోట్ల దాకా తగలేశారని అర్థమవుతోంది. రుషికొండ నిజాలు బయటకు వస్తున్నకొద్దీ జనం జగన్ ను అసహ్యించుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories