వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తూ దుష్ప్రచారాలను సాగిస్తూఉండే కిరాయిమూకలకు పవన్ కల్యాణ్ ఘాటైన హెచ్చరిక చేశారు. సోషల్ మీడియా ముసుగులో తప్పుడు పోస్టులు పెట్టడం, అమ్మాయిలను అవమానించే పోస్టులు పెట్టడం లాంటి దురాగతాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు ఉంటాయని పవన్ హెచ్చరించారు. దీపం 2 పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. వైసీపీ సాగిస్తున్న తప్పుడు ప్రచారాలపై రెచ్చిపోయారు.
సోషల్ మీడియాను వేదికగా చేసుకుని మహిళల గురించి నీచంగా మాట్లాడుతున్నారని… ఎవరూ తప్పించుకోలేరని, ఎక్కడికీ పోలేరని… ఇలాంటి వాళ్ల కోసమే డిజిటల్ ప్రైవసీ చట్టం వస్తోందని పవన్ అన్నారు. అది ఎలా పనిచేస్తుందో ఈలోపే మీకు చూపిస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎవరు తప్పు చేసినా వారిపై క్రిమినల్ రికార్డు ఉంటుంది…. అందుకే, ముందుగా చెబుతున్నాను అంటూ వివరించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు అధికారంలో ఉన్నంత కాలమూ ప్రతిపక్షాలకు చెందిన వారి కుటుంబ సభ్యుల గురించి కూడా అసభ్యంగా మాట్లాడుతూ నీచంగా చెలరేగిపోయాకరని పవన్ ఆవేశంగా అన్నారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పి వారు ఓడిపోయినా సరే.. మార్పు రాలేదని అన్నారు. వైసీపీ వాళ్లకు చింత చచ్చినా పులుపు చావలేదని, భవిష్యత్తులో నోట మాట రాకుండా చేస్తామని హెచ్చరించారు. మళ్లీ పాత తరహాలనే.. తమకు కిట్టని వారి కుటుంబ సభ్యులను ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తామంటే ఇక కుదరదు.. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోం. లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టు మీ సంగతి చూసే బాధ్యత నాది అని పవన్ అన్నారు.
వైసీపీ పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగాల్లో అన్ని హ్యాండిళ్ల మీద నిఘా ఉంటుందని, నిశితపర్యవేక్షణ ఉంటుందని, ఎక్కడ ఎప్పుడు వారు దారితప్పి పోస్టులు పెట్టినా ఊరుకునేది లేదని అంటున్నారు.
పవన్ మాటలు.. వైసీపీ కిరాయి మూకలకు గుబులు పుట్టించే విధంగానే ఉన్నాయి. మొత్తానికి కిరాయి డబ్బులకు ఆశపడి తప్పులు పోస్టులు పెట్టేవారికి ఇది చివరి హెచ్చరికలాగా ధ్వనిస్తోంది.