తెలుగుదేశం పార్టీ తాజాగా తమ అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్టు చదివిన ఎవరికైనా ఒకటే సందేహం కలుగుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య విజయమ్మను అంతం చేయడానికి గతంలో ఏమైనా ప్రయత్నం జరిగిందా? ప్రమాదంగా చిత్రీకరిస్తూ ఆమెను కడతేర్చడానికి ఎవరైనా ప్రయత్నించారా? అనేదే ఆ అనుమానం. తెలుగుదేశం పార్టీ ఎక్స్ ఖాతా గనుక.. వారేదో పనిగట్టుకుని అలాంటి అనుమానాలు పుట్టిస్తున్నారని అనుకోవడానికి వీల్లేదు. ఆ పోస్టు చదివితే.. అనుమానం కూడా సహేతుకమే అనిపిస్తుంది. ఇంతకూ ఆ పోస్టులో ఏం ఉందంటే..
‘‘రోడ్డు పక్కన దీనంగా పడి ఉన్న ఈ ఖరీదైన కారు ఎవరిదో కాదు… వందల మందిని తనకు రక్షణగా పెట్టుకుని తిరిగే లక్షల కోట్ల ఆస్తిపరుడు జగన్ మోహన్ రెడ్డి తల్లి విజయ రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ఇది. సరికొత్త కారు. అత్యాధునిక సెక్యూరిటీ హంగులు ఉన్న కారు. అయినప్పటికీ ఒకేసారి రెండు చక్రాలు ఊడిపోయాయి. ఇంకా నయం ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ఇంత హై ఎండ్ కారు, అదీ కొత్త కారుకి ఇలా జరగడం చూసి, ముందు ఆశ్చర్యపోయి, తర్వాత మన సైకో బ్యాక్ గ్రౌండ్ తెలిసి, ఏం జరిగిందో చాలా మంది ఊహించారు.
ఇదంతా జరిగింది 2024 ఎన్నికల ముందు. 2019 ఎన్నికలకు బాబాయ్ ని లేపేసినట్టే… ఈ ఎన్నికలకు మరో పెద్ద తలకాయను జగన్ టార్గెట్ చేస్తాడేమో అని ఏపీ ప్రజలు అనుకుంటున్న సమయంలో ఇది జరిగింది. తర్వాత ఏడాది పాటు విజయ రాజశేఖర్ రెడ్డి గారు అమెరికాలోనే ఉన్నారు. లోగుట్టు ఆ కుటుంబానికే ఎరుక!’’
అని తెలుగుదేశం పార్టీ ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. రెండు చక్రాలు ఊడిపోయిన కారు వీడియోను కూడా అందులో పోస్టు చేశారు. టోయోటో వెల్ఫైర్ (Toyota Vellfire) మోడల్ కారు అది. అత్యాధునిక సెక్యూరిటీ హంగులు ఉన్న ఈ విలాసవంతమైన కారు కనీస ధర 1.25 కోట్ల రూపాయలు. అలాంటి కారు అర్థంతరంగా రోడ్డు మీద వెళుతుండగా.. రెండు చక్రాలు ఒకేసారి ఊడిపోవడం అనేది చోద్యమే. విజయమ్మకు తప్పిన ప్రాణాపాయం అంటూ అప్పట్లో పత్రికల్లో విస్తృతంగా కథనాలు వచ్చాయి కూడా.
ఈ పోస్టు ద్వారా.. విజయమ్మ హత్యకు ఎవరో వ్యూహం పన్నిననట్టు తెలుగుదేశం ప్రజల మనసుల్లో అనుమాన బీజం నాటేసింది. పైగా వారు పేర్కొన్న వివరణ గమనిస్తే మాత్రం.. ఇది హత్యాయత్నం లాంటిదే అని ఎవరైనా నమ్మాల్సిందే. ఎన్నికల సమయంలో కనీసం తాను అండగా నిలిచిన కూతురు తరఫున ప్రచారం చేయడానికి కూడా రాకుండా వైఎస్ విజయమ్మ అమెరికా వెళ్లి అక్కడే ఏడాది పాటు ఉండిపోవడనికి కారణం కూడా ఇలా హత్యాయత్నం భయమేనని ఇప్పుడు ప్రజలు అనుకోవాల్సి వస్తోంది. మొత్తానికి ఈ రెండు చక్రాల్లేని కారు రాష్ట్రంలో ఒక కొత్త చర్చకు అవకాశం ఇస్తోంది.