వైఎస్సార్ కుటుంబం ఆస్తుల వివాదంలో కొత్త సంగతులు కూడా బయటకు వస్తున్నాయి. ఒకవైపు ఆస్తుల కోసం షర్మిల నానా యాగీ చేస్తుండగా.. ‘అబ్బెబ్బే షర్మిలకు ఆస్తుల మీద ఇంటరెస్టే లే.. ఆస్తుల గురించి ఆమె అడగనే లే,.. జగనే తానే పంచేస్తానన్నాడు’ అంటూ కొత్త వాదన తెరమీదకు వస్తోంది. ఈ వాదన చేస్తున్నది మరెవ్వరో కాదు. జగన్ ఔదార్యం తెలియజెప్పడానికి ఆయన పార్టీ వాళ్లు చేస్తున్న వాదన కూడా కాదు. స్వయంగా షర్మిల భర్త, బ్రదర్ అనిల్ చెబుతున్న మాటలు ఇవి. అస్తుల వివాదంలో ఆయన కొత్త సంగతి బయటపెడుతున్నారు.
షర్మిల ఆస్తిలో వాటా కావాలని ఎప్పుడూ అడగనే లేదని, పంపకాల గురించి ఆసక్తి చూపించలేదని, జగన్ ప్రతిపాదనతోనే ఆస్తుల విభజన జరిగిందని ఆయన అంటున్నారు. 2019 ఎన్నికల తర్వాత జగన్ వైఖరిలో పూర్తిగా మార్పు కనిపించిందని ఆయన బావగారు చెబుతున్నారు. అంటే అధికారం దక్కిన వెంటనే.. కుటుంబ సభ్యులను దూరం పెట్టాలనే వైఖరికి జగన్ వచ్చారనే అభిప్రాయం ఈ మాటలు విన్నవాళ్లకు కలుగుతోంది.
బ్రదర్ అనిల్ మాటలను గమనిస్తుంటే అసలు షర్మిల రాజకీయ జీవితం గురించి ఆలోచన చేయడమే జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు అని అర్థమవుతోంది. కేవలం ఎన్నికల ప్రచారానికి మాత్రమే ఆయన చెల్లెలిని వాడుకున్నారు. తల్లిని తొలి దశలో పోటీకి నిలబెట్టారు. తప్ప తర్వాత ఆమెను కూడా క్రియాశీల రాజకీయాలకు దూరం పెట్టారు. చెల్లెలు ఎన్నికల్లో ప్రచారం చేసి 2019 లో గెలిచిన తర్వాత తనకు రాజ్యసభ సభ్యత్వం కావాలని కోరుకుంటే తిరస్కరించారు. అక్కడితో జగన్ ఆగలేదని అర్థం అవుతుంది.
అన్నతో విభేదించి తెలంగాణను తన కార్యక్షేత్రంగా ఎంచుకున్న వైఎస్ఆర్ షర్మిల అక్కడ రాజకీయ పార్టీ పెట్టుకుంటే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి రకరకాలుగా అడ్డుపడ్డారని బ్రదర్ అనిల్ మాటల ద్వారా అర్థమవుతోంది. ఒక పత్రిక సంస్థలో షర్మిల భాగస్వామి అయినప్పటికీ ఆమె డబ్బులు ఇచ్చి ప్రకటనలు వేయాలని అడిగినా కూడా ఆ పత్రిక ప్రకటనలు స్వీకరించలేదని బ్రదర్ అనిల్ ఇవాళ కొత్త విషయాన్ని బయటపెట్టారు. వారిద్దరి తల్లి విజయమ్మ చెప్పినా కూడా సాక్షి దినపత్రికలో వైఎస్ షర్మిల తెలంగాణ పార్టీకి సంబంధించిన ప్రకటనలు తీసుకోవడానికి వాళ్ళు ఒప్పుకోలేదని బ్రదర్ అనిల్ చెబుతున్నారు. ఇవన్నీ కలగలిపి చూస్తే షర్మిల రాజకీయ ఆలోచన, ఆమె రాజకీయాల్లోకి రావడమే జగన్ కు ఇష్టం లేదు. ఎలాగైనా సరే అడ్డుకోవాలని ఆమె రాజకీయ జీవితం ముందుకు వెళ్లకుండా చూడాలని ఆయన కంకణం కట్టుకున్నట్లుగా అనిపిస్తుంది. ఆ వ్యవహారాలు ముదిరి ముదిరి ఇప్పుడు పంచిఇచ్చిన ఆస్తులను కూడా వెనక్కు అడిగేంతగా మారిపోయాయని అనుకుంటున్నారు.