తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలికి సారథిగా టీవీ5 మీడియా సంస్థ యజమాని బి ఆర్ నాయుడు ను నియమించడం ద్వారా తాను ఏం ఆశిస్తున్నారో చంద్రబాబు నాయుడు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి యొక్క ఐదేళ్ల పరిపాలన కాలంలో తిరుమలగిరులలో ధార్మిక వ్యవహారాల నిర్వహణపరంగా.. హిందూధర్మ సాంప్రదాయాల ఆచరణ పరంగా ఎలాంటి అరాచకత్వం రాజ్యమేలిందో ఆ పోకడలన్నింటినీ చక్కదిద్దడానికి ఉద్దేశించినట్టుగా ఈ నియామకం కనిపిస్తోంది. ఒక మీడియా సంస్థ యజమానిగా తప్పులను, లోపాయికారీ వ్యవహారాలను ఎత్తి చూపించే పనిలో ఉన్న వ్యవస్థ ప్రతినిధి ఇప్పుడు టీటీడీకి సారథి కావడం ఒక శుభ పరిణామం. బిఆర్ నాయుడు కూడా చంద్రబాబు నాయుడు తన మీద ఉంచిన నమ్మకాన్ని సరిగ్గానే గుర్తించినట్లు ఉన్నారు. రాబోయే రెండేళ్ల పదవీకాలంలో తన బాధ్యత ఏమిటో గ్రహించినట్లుగానే ఉన్నారు. అందుకే నియామకం తర్వాత మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో ఇన్నాళ్లు జరిగిన అరాచకాలను ఆయన ప్రస్తావిస్తున్నారు. వాటిని సంస్కరించవలసిన అవసరం ఉన్నదని అంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పదవీకాలంలో నాలుగేళ్ల పాటు ఆయన బాబాయి వైవి సుబ్బారెడ్డి టీటీడీ అధ్యక్షుడిగా కొనసాగారు. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థకు కస్టోడియన్‌గా ఉంటూ అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల దేవదేవుడిని అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా దోచుకోవడానికి ఆయన మార్గాలు తెరిచారు. శ్రీవాణి టిక్కెట్ వంటి వ్యవహారాల ద్వారా తిరుమల దేవుడి దర్శనాన్ని కేవలం ఒక కమర్షియల్ డీల్ లాగా మార్చేశారు దేశవ్యాప్తంగా టీటీడీ ఆలయాలు నిర్మించడానికి మాత్రమే ఆ డబ్బులను వెచ్చించే ఏర్పాటుతో దోపిడీపర్వానికి రాజమార్గాన్ని సృష్టించుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వైఖానస ఆగమ శాస్త్రానికి లోబడి ఏనాడు వ్యవహరించలేదు. బ్రహ్మోత్సవాలలో దేవదేవుడికి ప్రభుత్వం తరఫున వస్త్రాలు సమర్పించే ఏ సందర్భంలో కూడా ఆయన భార్య భారతిని వెంటబెట్టుకుని రాలేదు. క్రిస్టియన్ అయిన జగన్మోహన్ రెడ్డి ఏనాడు తిరుమల ఆలయ నిబంధనలను గౌరవించి డిక్లరేషన్ పై సంతకం చేయలేదు.
లడ్డూ తయారీకి వాడే నెయ్యి కల్తీ అనేది గత పరిపాలన కాలంలో అరాచకత్వానికి పరాకాష్ట. బయల్పడింది గనుక దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అలాంటి అరాచకత్వాలు ఎన్ని ఉన్నాయో తెలియదు. వాటన్నింటినీ కూడా చక్కదిద్దడం తన బాధ్యతగా బిఆర్ నాయుడు భావిస్తూ పాలన పగ్గాలు తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. తిరుమల ప్రతిష్ఠను, తద్వారా ప్రభుత్వ ప్రతిష్ఠను కాపాడడం తన భుజస్కంధాల మీద ఉందని ఆయన తెలుసుకోవాలి.