ఎవరైనా మన తప్పును వేలెత్తి చూపించినప్పుడు కనీసం ఆలకించేవాడు మంచివాడు. తప్పును అంగీకరించి దిద్దుకునే వాడు గొప్పవాడు. పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసేవాడు పతనమైనవాడు. ఈ మూడు కేటగిరీలకి చెందకుండా తప్పును తెలియచెప్పిన వారి మీదకు తన మనుషులను ఉసిగొలిపే వాడిని ఏమనాలి? మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే అనాలి! ‘‘జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది తప్పు! చెల్లెలికి అన్యాయం చేస్తున్నాడు’’ అనే ఆరోపణలతో తల్లి విజయమ్మ బహిరంగ లేఖ విడుదల చేసిన తర్వాత- జగన్మోహన్ రెడ్డి గొప్ప ఇరకాటంలో పడ్డారు. తన పార్టీకి చెందిన నాయకులతో- చెల్లెలు షర్మిల మీద విమర్శలు చేయించినంత సునాయాసంగా.. సొంత తల్లి విజయమ్మని తిట్టించడం కష్టం! కానీ జగన్ అలాంటి మొహమాటానికి పోకుండా తల్లిని మీద కూడా అదే రేంజిలో విమర్శలు కురిపించడానికి ప్రయత్నిస్తున్నారు. తన చేతికి మట్టి అంటకుండా… తన నోటికి పని లేకుండా తన వందిమాగధులతో విజయమ్మ మీద నిందలు వేయించడం ఆయనకు మాత్రమే చెల్లింది.
జగన్- షర్మిల ల మధ్య ఆస్తులకు సంబంధించిన తగాదా నడుస్తోంది. ప్రజలు ఇప్పటికే వారి వారి భావజాలం బట్టి ఒక జడ్జిమెంట్ కు వచ్చి ఉంటారు. నిజం చెప్పాలంటే.. పార్టీల అభిమానం పరంగా ప్రజల అభిప్రాయాలు చీలిపోయి ఉండడం వింత కాదు. కానీ, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు కాకపోయినప్పటికీ.. ఆడపిల్లకు ఆస్తిలో వాటా ఇవ్వడం ఏంటి? అని వాదించే రకం వాళ్లందరూ కూడా జగన్ పక్షాన నిలుస్తుంటారు. ఇలాంటి నేపథ్యంలో నిత్యం విమర్శలు ప్రతివిమర్శలతో కొనసాగిస్తూ ఉండడం అనవసరం. ఆ మాటకొస్తే ప్రజలు ఏం అనుకుంటున్నారనేదానితో ఆస్తుల తగాదా పరిష్కారం అయ్యే తీరుకు సంబంధం ఉండదు. కానీ జగన్ దళం మిన్నకుండ లేకపోతోంది.
కూతురుకు కొడుకు అన్యాయం చేస్తున్నాడని విజయమమ్మ ఒక బహిరంగ లేఖ రాయగానే.. దానిని జగన్ దళాలు తప్పుబడుతున్నాయి. విజయమ్మను కూడా చంద్రబాబు కుట్రలో భాగస్వామిగా అభివర్ణించడం ఒక్కటే మిగిలి ఉంది. విజయమ్మ ధృతరాష్ట్రుడి మీద ప్రేమతో గుడ్డిగా వ్యవహరించినట్టుగా విజయమ్మ కూడా జగన్ కు అన్యాయం చేస్తున్నారంటూ.. తమ కరపత్రికలో కారుకూతలు రాయిస్తున్నారు. తల్లి విజయమ్మ తాను తప్పు చేస్తున్నానని అన్నప్పుడు.. జగన్ వీలైతే దానిని దిద్దుకోవాలి.. లేదా కనీసం ఇగ్నోర్ చేస్తే పోయేది. కానీ తల్లిమీద కూడా ఎదురుదాడి చేయించడం అనేది ఆయన పరువునే దెబ్బ తీస్తోంది.