అమరావతి ప్రియులకు మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ మరో గొప్ప శుభవార్త చెప్పారు. డిసెంబరు 31 నాటికి ఒకటిరెండు మినహా.. అమరావతిలో పునఃప్రారంభించదలచుకున్న, కొత్తగా చేపట్టనున్న నిర్మాణాలు అన్నింటికీ టెండర్ల ప్రక్రియ పూర్తిచేస్తాం అని ఆయన వెల్లడించారు. అన్నీ అనుకున్నట్టు జరిగి.. ఈ సంవత్సరాంతానికి టెండర్లు పూర్లికావడం అంటూ జరిగితే.. అమరావతి నగరానికి గొప్ప ఎడ్వాంటేజీ కానుంది. ఎన్డీయే కూటమి ప్రభుత్వం వద్ద ఇంకా నాలుగున్నరేళ్ల సమయం ఉంటుంది. ఆలోగా నగరం రూపురేఖలను ఒక దశకు తీసుకురావడం సాధ్యం అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐకానిక్ భవనాలు నాలుగేళ్లలో పూర్తికాకపోవచ్చు గానీ.. చాలా వరకు నిర్మాణాలు పూర్తయ్యే అవకాశం ఉందంటున్నారు.
మంత్రి నారాయణ అమరావతి ప్రియులకు వెల్లడించిన మరో గొప్ప శుభవార్త ఏంటంటే.. చంద్రబాబునాయుడు కొన్ని సంవత్సరాల సుదీర్ఘ కసరత్తు, మేధోమధనం తర్వాత.. ఏ రూపంలో అమరావతి నగరాన్ని స్వప్నించారో.. అదే రూపంలో అవే డిజైన్ల ప్రకారం ఇప్పుడు నిర్మాణాలు చేపట్టబోతున్నారు. ఐకానిక్ భవనాలు సచివాలయం, హైకోర్టు, శాసనసభలకు సంబంధించిన భవనాలకు గతంలో రూపొందించిన ఎక్స్‌టీరియర్ డిజైన్లను అలాగే ఉంచి.. ఇంటీరియర్ డిజైన్లను మార్పిస్తాం అని చంద్రబాబు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
వీటిలో శాసనసభ మినహా మిగిలిన నిర్మాణాలకు సంబంధించిన పనులు ఆల్రెడీ మొదలయ్యాయి కూడా. కాబట్టి అంతా అదే కరెక్టు అనుకున్నారు. కేవలం ఐకానిక్ భవనాలు మాత్రమే కాకుండా.. యావత్ నగరంకోసం గతంలో రూపొందించిన డిజైన్ల ప్రకారమే ముందుకు వెళ్లనున్నట్టుగా తాజాగా నారాయణ చెబుతున్నారు.
చంద్రబాు హయాంలో ఆయన రూపొందించిన ఏ డిజైన్లను చూసి తెలుగు ప్రజలు మురిసిపోయారో.. ప్రపంచం మొత్తం తలతిప్పి చూసే రాజధానిగా అమరావతి రూపుదిద్దుకోబోతున్నదని సంతోషపడ్డారో అవే డిజైన్ల ప్రకారమే ఇప్పుడు నిర్మాణ జరగనుంది.
పైగా నారాయ మాటల్లో మరో కొత్త హామీ కూడా ప్రజలకు కొత్త ఆశలను చిగురింప జేస్తోంది. అమరావతి నగర నిర్మాణాల్లో ఏఐ టెక్నాలజీని కూడా వినియోగించనున్నట్టు ఆయన చెబుతున్నారు. ఏఐ అనేది దాదాపుగా అన్ని రంగాలను శాసిస్తున్న రోజులు ఇవి. ఆ సాయం కూడా తోడైతే అమరావతి నిర్మాణం మరింత వేగవంతంగా జరుగుతుందని ప్రజలు కోరుకుంటున్నారు.