తిరుమలలో ఇప్పుడు సరికొత్త వివాదం ఒకటి తెరపైకి వచ్చింది. హిందూ ధర్మానికి చెందిన స్వామీజీలను టీటీడీ అధికారులు అవమానపరిచారు.. వారికి దర్శనం ఏర్పాట్లు కల్పిస్తామని చెప్పి, మాట తప్పరంటూ ఒక స్వామీజీ తీవ్రమైన ఆరోపణలు చేయడంతో.. అందరి దృష్టి అటువైపు మళ్లుతోంది. అయితే స్వామీజీలు కూడా అనుచితమైన, అసాధ్యమైన కోరికతో టీటీడీని ఇబ్బంది పెట్టడానికే ఒక కోరిక కోరడము, అది తీరలేదని, వెంటనే విమర్శలు చేయడమూ జరిగిందనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది. ఎందుకంటే విమర్శలు చేసిన స్వామీజీ తమకు దర్శనం దొరకలేదని బాధతో పాటు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల భక్తిని కూడా ప్రదర్శించుకోవడానికి తాపత్రయపడటమే కారణం.
తిరుపతి అర్బన్ హాట్ లో జాతీయ సాధు సమ్మేళనం జరిగింది. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా అనేకమంది స్వామీజీలు హాజరయ్యారు. ఏ స్థాయి స్వామీజీలు అనేది ప్రజలకు తెలియదు. శ్రీకాకుళం జిల్లా కృష్ణాపురం గ్రామంలో ఆనందాశ్రమం అనేది ఒకటి ఉంది. ఆ ఆశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి స్వామి కూడా వీరిలో ఉన్నారు. సాధు సమ్మేళనం ముగిసిన తరువాత స్వాములకు సరైన దర్శన ఏర్పాట్లు చేయలేదంటూ ఈ శ్రీనివాసానంద, టిటిడిపై ఒక రేంజిలో ఫైర్ అయ్యారు. 300 మంది స్వాములకు దర్శనం కల్పిస్తామని, టీటీడీ అధికారులు మాట ఇచ్చారని అయితే ఆ మాట తప్పారని స్వామీజీలను అవమానించారని ఆయన ఆరోపించారు.
అక్కడి వరకు ఆయన పరిమితమై అయి ఉంటే స్వామీజీల ఆవేదనగానే ఉండేది. కానీ అక్కడితో ఆగకుండా, స్వామీజీలకు గౌరవం ఇచ్చి విఐపిలకు మించి స్వామివారి దర్శనం చేయించడంలో వైసీపీ హయాంలో చాలా గొప్పగా ఉండేదని ఇప్పుడున్న జేఈవో వెంకయ్య చౌదరి లాంటి అవగాహన లేని వారి వల్ల ధర్మం గాడి తిప్పుతోందని రాజకీయ విమర్శలకు దిగారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ అధికారిని టీటీడీ జేఈఓ గా నియమించాలని రకరకాల ఆరోపణలు గుప్పించారు. ఇవన్నీ జగన్ భక్త రాజకీయ ఆరోపణలాగా కనిపిస్తున్నాయి.
అయితే టీటీడీ అధికారులు దీనికి సహేతుకమైన వివరణ కూడా ఇచ్చారు.
ఈ శ్రీనివాసనంద సరస్వతి టిటిడి అధికారులను కలిసి 50 మందికి బ్రేక్ దర్శనాలు, 550 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనాలు వీరందరికీ కలిపి తిరుమల లో వసతి కల్పించాలని కోరారుట. ఆదివారం నాడు తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది కాబట్టి ఆ రోజున ఇంతమందికి దర్శనం సాధ్యం కాదని మాత్రమే అధికారులు చెప్పారు. తాను అడిగినన్ని దర్శనం టికెట్లు ఇవ్వలేదని కోపంతో అధికారులపై ఆయన ఇలాంటి చవకబారు ఆరోపణలు చేశారనేది తేలుతుంది.
సన్యసించినప్పుడు ముందుగా ఆవేశ కావేషాలను విసర్జించకుండా ఆయన స్వామీజీ ఎలా అయ్యారో కూడా తెలియదు. తిరుమలేఝశుని దర్శనం కోరుకుంటూ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనను ప్రస్తుతించడం సబబు అని ఆయన ఎలా భావించారో కూడా తెలియదు. ఇలాంటి స్వాములు వల్ల నిజంగానే ధర్మం భ్రష్టుపడుతోందని ప్రజలు అనుకుంటున్నా రు. శ్రీనివాసానంద సరస్వతి తన రాజకీయ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, టీటీడీ నిర్వహణలో అధికారులకు ఉండగల సాధకబాధకాలను కూడా అర్థం చేసుకొని నడుచుకోవాలని ప్రజలు అంటున్నారు.