యథా బాసూ తథా బంటూ.. అంతా డొంకతిరుగుడే!

పోలీసులు విచారణ సందర్భంగా ప్రశ్నలు అడిగినప్పుడు డొంక తిరుగుడు సమాధానాలు చెప్పడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి ఒక్కరూ ఆరితేరిపోయినట్లున్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడికి సంబంధించి విచారణలు సాగుతూంటే.. పార్టీ నాయకులు పలువురు ఎలాంటి సమాధానాలు చెప్పారో.. ఎంత డొంకతిరుగుడు జవాబులతో పోలీసులను ఇరిటేట్ చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. చివరికి దాడిలో స్వయంగా పాల్గొన్న, అందుకోసం మనుషుల్ని పోగేసిన ఏ1 నిందితుడు కూడా.. అచ్చంగా నాయకుల బాటలోనే నడుస్తున్నాడు. ‘తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా..’ టైపు ఆన్సర్లతో తప్పించుకోవాలని చూస్తున్నారు.

టీడీపీఆఫీసుపై దాడి కేసులో ప్రధాన నిందితుడు పానుగంటి చైతన్యను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ ఇప్పుడు సీఐడీకి మారిన సంగతి తెలిసిందే. ఆరోజున ముందు తామంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నాం అని, అక్కడినుంచి తెదేపా ప్రధాన కార్యాలయంపై దాడికి తరలి వెళ్లామని పానుగంటి చైతన్య సీఐడీ పోలీసులకు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. అంతే అదొక్క ప్రశ్నకే జవాబు చెప్పారన్నమాట. మిగిలిన ప్రశ్నలకు అన్నింటికీ దాటవేత అనేదే తన సహజమైన జవాబు అన్నట్టుగా బుకాయించే ప్రయత్నం చేయడం విశేషం.

ఇప్పటిదాకా ఈ కేసులో నిందితులు అయిన సీనియర్లు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, దేవినేని అవినాష్, సజ్జల రామక్రిష్ణారెడ్డి అందరూ కూడా.. డొంకతిరుగుడు స మాధానాలు మాత్రమే పోలీసుల వద్ద చెబుతూ వచ్చారు. తమకు సంబంధం లేదని, అప్పట్లో వాడిన ఫోను  ఇప్పుడు ఎక్కడ ఉన్నాదో తెలియదని ఇలా రకరకాలుగా చెబుతూ వచ్చారు. లేళ్ల అప్పిరెడ్డి అనుచరుడిగా కీర్తి ఉన్న పానుగంటి చైతన్య కూడా అచ్చంగా తమ బాసుల బాటలోనే ప్రయత్నిస్తుండడం విశేషం.

దాడి జరిగిన రోజున గుంటూరు నుంచి తీసుకెళ్లిన యువకులందరికీ భోజనాలు, వాహనాలు ఇతర ఖర్చులు ఎవరు చూశారన్న ప్రశ్నకు పానుగంటి చైతన్య సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డినుంచి దాడికి ముందు ఫోన్లు వచ్చాయి కదా.. అంటే తనకు ఎవరి దగ్గరనుంచీ ఫోన్లు రాలేదని చైతన్య చెప్పడం ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలు అందులోని వ్యక్తులు తనకు తెలియదంటూ బుకాయించే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి పానుగంటి చైతన్య సహా తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడికేసులో కీలక నిందితులు అయిన ముఖ్యులందరూ కూడా తాము బుకాయిస్తున్నాం అనే భ్రమలో పూర్తిగా కూరుకుపోతున్నారని విశ్లేషకులు బావిస్తున్నారు. ఎందుకంటే లేళ్ల అప్పిరెడ్డి నుంచి తనకు ఫోను రాలేదని చైతన్య చెప్పవచ్చు. వాళ్లు తమ (అప్పటి) ఫోన్లను పోలీసులకు స్వాధీనం చేయకుండా దాచవచ్చు. కానీ.. కాల్ రికార్డులు పరిశీలించినా సరే.. బాగోతం బయటపడుతుంది కదా అనేది ఇప్పుడు కీలకంగా చర్చ జరుగుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories