వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ బెంగుళూరుకు సకుటుంబంగా వెళ్లారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన బెంగుళూరుకు వెళ్లడం ఇది 15వ సారి. ఇన్ని సార్లు బెంగుళూరుకు జగన్ ఎందుకు వెళుతున్నారు? తొలినుంచి అందరికీ ఉన్న సందేహం ఇది. అయితే ఈసారి బెంగుళూరు పర్యటన వెనుక మర్మం ఇదే.. అంటూ పలు గుసగుసలు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి. చెల్లెలితో ఆస్తుల పంచాయతీని ట్రిబ్యునల్ దాకా తీసుకువెళ్లిన జగన్మోహన్ రెడ్డి.. ఇతర మార్గాల్లో కూడా చెల్లెలి మీద పగసాధించే ప్రయత్నాలకు, అలాగే, ట్రిబ్యునల్ దశ దాటిన తర్వాత మళ్లీ పైకోర్టులను ఆశ్రయించాల్సి వస్తే అనుసరించాల్సిన న్యాయనిపుణులతో వ్యూహాలకు పదును పెట్టడానికి ఆయనబెంగుళూరుకు వెళ్లారనే పుకార్లు వినిపిస్తున్నాయి.
వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఆస్తుల తగాదాను రచ్చకీడ్చి కుటుంబం పరువును బజారుపాలు చేశారు జగన్మోహన్ రెడ్డి.
ఇప్పుడు అన్నా చెల్లెళ్లు ఇద్దరూ పరస్పరం తీవ్రమైన ఆరోపణలతో ఒకరి గుట్టు ఒకరు బయటపెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో తెలియకుండానే సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారనే అభిప్రాయం కూడా కొందరిలో కలుగుతోంది. జగన్ వాదన ట్రిబ్యునల్ ముందు నిలబడే అవకాశం లేదని కూడా చాలా మంది న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. చెల్లెలి ప్రేమ ఉత్తదే అనే కారణం మీద ఆమెతో చేసుకున్న ఎంఓయూను రద్దు చేసుకోవడం సాధ్యం కాదని పలువురు అంటున్నారు. అయితే చెల్లెలికి తనకు మధ్య నడిచిన ఉత్తరాలే పెద్ద లీగల్ డాక్యుమెంట్స్ లాగా జగన్ వాటిని కూడా ట్రిబ్యునల్ కు సమర్పించడం విశేషం. అంతమాత్రాన ఆయనకు వచ్చే ఎడ్వాంటేజీ లేదని కూడా అంటున్నారు.
అయితే ఇప్పుడు మళ్లీ బెంగుళూరుకు వెళ్లిన జగన్ దంపతులు ఈ కేసు విషయం అక్కడ పలువురితో మంతనాలు సాగించబోతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెసు పార్టీలో షర్మిలను అష్టదిగ్బంధనం చేయడానికి కన్నడ ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ తో ఉన్న అనుబంధాన్ని జగన్ వాడుకోబోతున్నారా? అనే దిశగా కూడా పుకార్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పీసీసీ సారథి అనే పదవి కూడా లేకపోతే.. షర్మిల మరింత వీక్ అవుతారనే అభిప్రాయం జగన్ లో ఉంది. అందుకోసం కూడా బెంగుళూరు నుంచి చక్రం తిప్పజూస్తున్నట్టు సమాచారం.
అలాగే.. ట్రిబ్యునల్ లో ఎటూ కేసు గెలవడం సాధ్యం కాదని, అలా జరిగితే.. ఏ కోర్టుకు వెళ్లాలి.. అనే విషయంలో కూడా సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదులతో చర్చించడానికి ఆయన బెంగుళూరు ప్యాలెస్ ను సేఫ్ ప్లేస్ గా భావిస్తున్నట్టు సమాచారం. తాడేపల్లి నివాసం మీద మీడియా నిఘా ఉంటుంది గనుక.. ఇక్కడకు ఎవరు వచ్చినా వెళ్లినా అందరికీ తెలిసిపోతుంది. బెంగుళూరు ప్యాలెస్ లో భేటీలు రహస్యం పొక్కే అవకాశం లేదని ఆయన అక్కడనుంచే మంత్రాంగం నడపాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది.