రాష్ట్ర ఐటీ మరియు విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికాలో వారం రోజులపాటు పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రాన్ని సమూలంగా మార్చి వేయడానికి సరికొత్త పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్ కు ఆహ్వానించడానికి ఇప్పటికే పలు విడతలుగా దేశవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతూ వారి సానుకూలతను సాధిస్తూ వస్తున్న నారా లోకేష్ అమెరికాలో వారం రోజులు పాటు వరుసగా పెట్టుబడిదారులతో సమావేశం కాబోతున్నారు. ఏపీలో వారి ప్రాజెక్టుల ప్రారంభించడానికి ఆహ్వానించనున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం కల్పించే సదుపాయాలు అన్నింటిని వారికి వివరించనున్నారు.
ఇప్పటికే విశాఖపట్నం ను ఐటి రాజధానిగా తయారు చేయడానికి ప్రభుత్వం సంకల్పం తీసుకున్న సంగతి తెలిసిందే. లోకేష్ పూనికతో టాటా కన్సల్టెన్సీ వారు డెవలప్మెంట్ జోన్ ను విశాఖలో ఏర్పాటు చేయడానికి అంగీకరించారు. వేల మందికి తద్వారా ఉపాధి అవకాశాలు వస్తాయని చెబుతున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కూడా ఎలక్ట్రానిక్ రంగ పారిశ్రామిక వేత్తలతో లోకేష్ ప్రత్యేకంగా సమావేశమై వారిని ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించడం జరిగింది. స్వదేశంలో జరుగుతున్న ప్రయత్నాలతో సరిపెట్టకుండా అమెరికాలో వారం రోజులపాటు పర్యటించి అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఏపీకి ఆహ్వానించేందుకు లోకేష్ పూనుకుంటున్నారు.
శుక్రవారం నుంచి నవంబర్ నెల ఒకటో తేదీ వరకు అమెరికాలో లోకేష్ పర్యటన సాగుతుంది. ఒరాకిల్ సంస్థ ప్రతినిధులు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో 25న సమావేశం అవుతారు. అలాగే పత్ర సెనర్జీస్, బోస్సన్, పాన్ఐఓ, క్లారిటీ, ఎడోబ్, స్కేలర్ వంటి సంస్థల ప్రతినిధులతో 26వ తేదీన భేటీ అవుతారు. ఆస్టిన్ లోని పలు కంపెనీల ప్రతినిధులతో 27న, మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో రెడ్ మండ్‌లో 28న భేటీకానున్నారు. 29న ఆమెజాన్ సహా అనేక కంపెనీల ప్రతినిధులతో సమావేశం అవుతారు. అలాగే ఐటీ సర్వ్ సెనర్జీ సదస్సులో కీలక ప్రసంగం చేస్తారు. 30వ తేదీన కూడా వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. 31వ తేదీన మాత్రం ఒక పార్టీ కార్యక్రమమే ఏర్పాటయింది. జార్జియాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. న్యూయార్క్ లోని పెట్టుబడిదారులతో నవంబర్ 1వ తేదీన సమావేశం పూర్తయిన తర్వాత రాష్ట్రానికి తిరిగి వస్తారు. ఇంతటి బిజీ షెడ్యూల్తో పదుల సంఖ్యలో పారిశ్రామికవేత్తలను కలవడం ద్వారా పెద్ద సంఖ్యలో రాష్ట్రానికి పెట్టుబడులను ఉద్యోగ ఉపాధి అవకాశాలను తీసుకురావడానికి నారా లోకేష్ కోరుకుంటున్నారు. ఆయన ప్రయత్నంలో 50 శాతం సఫలమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఐటిరంగ ముఖచిత్రం చెప్పుకోదగినంతగా మారుతుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు.