‘నేను జగనన్న వదిలిన బాణాన్ని’ అంటూ ఒక పదునైన నినాదంతో వైఎస్ షర్మిల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకపట్లో దూసుకుపోయారు. 2014 ఎన్నికల్లో గాని 2019 ఎన్నికల్లో గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఆమె తన చెమటోడ్చి, రక్తమోడ్చి మరీ పని చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ పదుల సంఖ్యలో బహిరంగ సభలు నిర్వహిస్తూ రోడ్డుషోలు నిర్వహిస్తూ విపరీతంగా కష్టపడ్డారు. మిగిలిన అంశాలతో పాటు.. ఆ కష్టానికి ఫలితంగానే 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగారు కూడా. అయితే అప్పట్లో షర్మిల చేసినది మొత్తం ‘‘పెయిడ్ కూలీ’’ లాంటి ప్రచారమేనా? కేవలం డబ్బులతో ఒక బేరం మాట్లాడుకుని- చెల్లెలితో ఆ మేరకు జగన్ ప్రచారం చేయించుకున్నారా? ఆ పెయిడ్ కూలీ ప్రచారానికి ఇప్పుడు ‘‘ప్రేమ, ఆప్యాయతలు’’ అనే అందమైన ముసుగు తొడుగుతున్నారా? అనే అనుమానాలు ప్రజలలో కలుగుతున్నాయి.
జగన్మోహన్ రెడ్డి చెల్లెలికి, తల్లికి ఇచ్చిన షేర్ల గిఫ్ట్ డీడ్ ను రద్దు చేసుకోవడానికి ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. తన తండ్రి రాజశేఖరరెడ్డి సంపాదించిన, వారసత్వంగా ఆయనకు సంక్రమించిన ఆస్తులను బతికి ఉండగానే పిల్లలిద్దరికీ పంచేశారని ఆ తర్వాత తన సొంత శ్రమ పెట్టుబడితోనే వ్యాపారాలు చేశారని జగన్ చెప్పుకున్నారు. తద్వారా షర్మిలకు బదిలీ చేసిన కొన్ని ఆస్తులు కేవలం తన సొంత సంపాదనలోంచి ఇచ్చినవే అని సంకేతాలు ఇవ్వడానికి ప్రయత్నించారు. ఆమెకు నమ్మకం కలిగించడానికి గిఫ్ట్ డిడ్ కింద అమ్మ పేరిట కొన్ని షేర్లు రాసినట్లుగా కూడా చెబుతున్నారు. ఇవి కాకుండా నీకు నేరుగా అమ్మ ద్వారా గత దశాబ్ద కాలంలో 200 కోట్లు ఇచ్చాను- అని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. దశాబ్ద కాలంలో అంటే దాని అర్థం ఆయన జైలులో ఉన్న పీరియడ్ నుంచి- 2019 ఎన్నికల వరకు అని అనుకోవచ్చు. అంటే ఆ సమయంలో పార్టీ కోసం షర్మిల చేసిన కష్టం మొత్తానికి కూలీ లెక్క కట్టి 200 కోట్లు ఇచ్చేటట్లుగా జగన్మోహన్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారేమో అనే అభిప్రాయం కలుగుతోంది.
ఇప్పుడు తల్లికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ షేర్లను రద్దు చేయడం కోసం ట్రిబ్యునల్ ను ఆశ్రయించడానికి జగన్మోహన్ రెడ్డి కుంటి సాకులు వెతుక్కుంటున్నారు. ఎలాంటి ఆబ్లిగేషన్ లేకుండానే చెల్లెలికు 200 కోట్లు డబ్బు ఇచ్చినట్లుగా ఆయన లెక్కలు చెబుతున్నారు. అయితే ఆమె పదేళ్లపాటు అన్నయ్య పార్టీకి అండగా ఉండడం, ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కష్టపడడం అనేది ఆయన కోరుకున్న అతిపెద్ద ఆబ్లిగేషన్ అని ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆ విషయాన్ని షర్మిల న్యాయస్థానంలో కూడా చెప్పగలరు. అన్నయ్య తనకు డబ్బులు కానుకగా ఎలా ఇచ్చారో.. దానికి ప్రేమ అనే ముసుగు ఎలా తొడిగారో.. తాను కూడా అలాగే ప్రేమ అనే ముసుగు తొడిగి- పార్టీ కోసం పడిన కష్టాన్ని ఆమె న్యాయస్థానం ఎదుట చెబితే.. వీరిద్దరి మధ్య పెయిడ్ ప్రచారంతో కూడిన క్విడ్ ప్రోకో వ్యవహారం నడిచింది అనే సంగతి రాష్ట్ర ప్రజలకు కూడా అర్థం అవుతుంది.
జగన్మోహన్ రెడ్డి ఎంత సంకుచిత రాజకీయాలు చేస్తున్నారో గమనించి ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు. సొంత కుటుంబానికి న్యాయం చేయలేని వాడు రాష్ట్రం మొత్తాన్ని ఉద్ధరిస్తానని బయలుదేరితే నమ్మడం తాము చేసిన తప్పు అని ప్రజలు అనుకుంటున్నారు. ఇంకోసారి షర్మిల ఎలాంటి ప్రచారంతో ముందుకు వచ్చినా నమ్మే అవకాశమే లేదని.. రాష్ట్రాల్లోని మహిళల పట్ల ప్రేమానురాగాలు కురిపిస్తూ జగన్ చెప్పే మాటలేవీ నిజాయితీతో కూడినవి కాదని ప్రజలు అనుకుంటున్నారు. ఈ పరిణామాలు జగన్మోహన్ రెడ్డికి ఆత్మహత్యా సదృశ్యంగా మారే అవకాశం ఉంది.