జగన్ మోసాలను ప్రపంచానికి చాటిన మరో చెల్లెలు!

ఒక దశాబ్ద కాలానికి పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అనుబంధం కలిగి ఉండిన.. ఆ పార్టీకి కీలకమైన  నాయకురాలిగా వ్యవహరిస్తూ అవసరమైన అనేక సందర్భాలలో పార్టీ కి మద్దతుగా తన వాదనను వినిపించిన జగన్ చెల్లెళ్ల దళంలో ఒకరు వాసిరెడ్డి పద్మ ఇప్పుడు పార్టీకి రాజీనామా చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రపంచం మొత్తాన్ని మోసం చేస్తూనే ఉన్నారని ఆ మోసాలను భరించలేకపోతున్నానని,  ఇంకా కొనసాగుతున్న అదే వంచన ధోరణులను సహించలేక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా వాసిరెడ్డి పద్మ ప్రకటించారు.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా కూడా వ్యవహరించిన వాసిరెడ్డి పద్మ, కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి పంపిన తన రాజీనామా లేఖలో అనేక విషయాలను ప్రస్తావించారు.

లోకేష్ రెడ్ బుక్ తయారు చేస్తే తాను గుడ్ బుక్ తయారు చేస్తున్నానని.. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారందరి పేర్లను అందులో నమోదు చేస్తానని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరినీ ప్రమోట్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో నాటకీయ డైలాగులు చెబుతున్న సంగతి అందరికీ తెలుసు. ఈ డైలాగులను కూడా వాసిరెడ్డి పద్మ తీవ్రంగా నిరసించారు. గుడ్ బుక్ పేరుతో మరోసారి జగన్ పార్టీ కార్యకర్తలని మోసం చేయడానికి సిద్ధపడ్డారని ఆమె విమర్శించారు. కావాల్సింది గుడ్ బుక్ కాదని గుండె బుక్ అని ఆమె జగన్ కు హితవు చెప్పారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో జగన్ ప్రజలను కూడా మోసం చేశారని.. ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతో పేద ప్రజలను దోచుకున్నారని.. ప్రజా సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించిన వాసిరెడ్డి పద్మ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత లేదని ఎన్నో అవమానాలు సహిస్తూ పార్టీ కోసం అక్కడ పనిచేశానని కన్ఫెస్ చేయడం గమనార్హం.

తన పాలనలో మహిళల మీద ఎన్ని ఆకృత్యాలు జరిగినా కనీసం స్పందించని జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రతి చిన్న సంఘటనకు అతిగా స్పందిస్తూ మనోరకంగా కూడా ప్రజలను మోసం చేస్తున్నారని వాసిరెడ్డి పద్మ అనడం రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. చెల్లెలు షర్మిల అన్నయ్యకు రాసిన లేఖ బయటకు వచ్చిన రోజునే.. మరో చెల్లెలు వాసిరెడ్డి పద్మ రాజీనామా చేయడం అనేది యాదృచ్ఛికమే కావొచ్చు.

Related Posts

Comments

spot_img

Recent Stories