తన పరువు తానే బజారున పెట్టుకున్న జగన్!

నిజానికి జగన్మోహన్ రెడ్డి తన పరువు తానే తీసుకున్నారని అనడానికి కూడా వీల్లేదు. ఇది కేవలం ఆయన పరువుకు సంబంధించిన వ్యవహారం మాత్రమే అనడానికి అవకాశం లేదు. ఆయన తన అత్యాశ, దుందుడుకుతనం, ఓర్వలేనితనం, అసూయ, అసహనం, తదితర కారణాలతో తీసుకున్న అనాలోచిత తప్పుడు నిర్ణయాల ఫలితంగా వైయస్ రాజశేఖర్రెడ్డి పరువును, ఆయన కుటుంబ గౌరవాన్ని ఇవాళ బజారులో పెట్టారు. సరస్వతీ పవర్ షేర్ల విషయంలో తల్లికి చెల్లికి రాసిన లేఖ, దాని పర్యవసానంగా ఆయనకు చెల్లెలు షర్మిల రాసిన జవాబు ఇప్పుడు సర్వత్రా తీవ్ర సంచలనాంశం అవుతున్నాయి. వైయస్ షర్మిల లేఖ సోషల్ మీడియాలో లీక్ అయింది. అన్న జగన్మోహన్ రెడ్డి దురాలోచనలు, దుర్మార్గపు నిర్ణయాలను ఆమె అందులో పూర్తిగా ఎండగట్టారు. తల్లి విజయమ్మ కూడా ఈ లేఖ మీద సంతకం చేయడంతో వైఎస్ షర్మిల లేఖకు చట్టబద్ధత మాత్రమే కాదు.. పవిత్రత కూడా పెరిగింది అని ప్రజలు భావిస్తున్నారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవించి ఉండగా ఆ కుటుంబానికి సమకూరిన ఆస్తులన్నింటిలోనూ ఆయన నలుగురు మనవలకి సమాన వాటా ఉండాలని కోరుకున్నారనే సంగతి వైఎస్ షర్మిల అన్నకు గుర్తు చేశారు. ఈ విషయానికి తమ ఇద్దరి తల్లి వైయస్ విజయమ్మ సాక్షి అనే సంగతిని కూడా ఆమె పదే పదే ప్రస్తావించారు. ఆయన మరణానంతరం తండ్రి కోరిక మేరకు ఆస్తులను సమాన వాటాలుగా విభజించడంలో జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని ఆమె ప్రస్తావించారు. ఆస్తుల విషయంలో అన్యాయం చేస్తూ చేసుకున్న ఎంఓయూ ను గుర్తు చేశారు. అందులోని  నిబంధనలను కూడా అతిక్రమిస్తూ సరస్వతీ పవర్ షేర్లను పొందడానికి తల్లికి లేఖ రాయడాన్ని ఆక్షేపించారు. జగన్మోహన్ రెడ్డి దురాలోచనతోనే ఇదంతా చేస్తున్నారని, ఆయనకు తగదని ఆస్తుల విషయంలో సమాన వాటాలు పంచాల్సిందేనని షర్మిల ఆ లేఖలో ఎలుగెత్తి చాటారు.

రాజకీయంగా తనను నిర్దేశించడానికి ప్రయత్నిస్తే అనుమతించేది లేదని కూడా ఆమె జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారు. బహిరంగ వేదికల మీద అవినాష్ రెడ్డి, జగన్ ల గురించి మాట్లాడకుండా ఉండాలని సూచిస్తే ఒప్పుకోనని రాజకీయంగా తన ప్రస్థానాన్ని అడ్డుకోవడం జగన్ వల్ల కాదని షర్మిల హెచ్చరించడం విశేషం. అన్నింటికంటే తమాషా ఏమిటంటే షర్మిల 8 అంశాలతో అన్న జగన్మోహన్ రెడ్డికి రాసిన రెండు పేజీల ఘాటైన లేఖకు వారిద్దరి తల్లి వై ఎస్ విజయమ్మ మద్దతు కూడా ఉండడం. ఆ లేఖ రెండు పేజీల మీద కూడా వైయస్ షర్మిల తో పాటు వైఎస్ విజయమ్మ కూడా సంతకం చేశారు. ఈ లేఖను తెలుగుదేశం పార్టీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో బయట పెట్టింది. లేఖ పూర్తిగా కూడా బయటకు వచ్చింది. రాజశేఖరరెడ్డి కుటుంబం పరువు మొత్తం జగన్ కారణంగా బజారున పడింది. ఆయన ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, అసలు పరువు కాపాడుకునే ఆలోచన ఆయనకు ఉన్నదో లేదో వేచి చూడాలి!

Related Posts

Comments

spot_img

Recent Stories