అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలకమైన ముందడుగు పడనుంది. ఇప్పటికే రాజధాని భవనాల నిర్మాణ పనులు పునః ప్రారంభం అయ్యాయి. ఐకానిక్ భవనాల సహా సమస్త నిర్మాణాలు మళ్లీ జోరు అందుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన భవనాలన్నీ త్వరలోనే మొదలు కాబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతి వ్యాప్తంగా ఎటు చూసినా నిర్మాణాలు జోరందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు పడబోతున్న ముందడుగు కూడా మరింత కీలకం కానున్నది. అమరావతి రాజధాని కోసం తమ పొలాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చిన రైతులకు ఈ-లాటరీ విధానం ద్వారా ప్రత్యామ్నాయ ప్లాట్లను బుధ గురు వారాలలో కేటాయించనున్నారు.
భూములు ఇచ్చిన రైతులకు కూడా అమరావతిలో దక్కబోయే ప్లాట్లను కేటాయించడం పూర్తయితే కనుక ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాలతో పాటు ప్రైవేటు నిర్మాణాలు కూడా జోరందుకునే అవకాశం ఉంది. రైతులకు వారు ఇచ్చిన పొలాలకు బదులుగా డెవలప్ చేసిన నగరంలో ప్లాట్లను కేటాయిస్తామని ప్రభుత్వం ముందే ప్రకటించింది. దానికి తగినట్లుగా ఇప్పుడు నిర్మాణాలు ఊపందుకుంటున్న సమయంలో వారికి ఈ కేటాయింపులు జరగనున్నాయి. ఎలాంటి అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి తావు లేకుండా ఉండేలాగా రైతులు కేటాయించిన పొలాలకు బదులుగా ఈ-లాటరీ విధానం ద్వారా ప్రత్యామ్నాయ ప్లాట్లు ఇవ్వనున్నారు. వీటిని పొందిన రైతులు తమకు నచ్చిన ధరలకు విక్రయించుకునే అవకాశం ఉంటుంది. లేదా ఏ ప్రాంతంలో వారికి స్థలం వచ్చిందనే దానినిబట్టి మాస్టర్ ప్లాన్ లో ఆ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయో అంచనా వేసుకొని.. తదనుగుణంగా ప్రైవేటు నిర్మాణాలు ప్రారంభించుకునే అవకాశం కూడా ఉంటుంది. తదనగుణమైన వ్యాపార సంస్థల ఏర్పాటుకు అవకాశం ఏర్పడుతుంది. ఆ రకంగా ఒకవైపు ప్రభుత్వ భవనాలతో పాటు సమాంతరంగా ప్రైవేటు భవనాల నిర్మాణం కూడా ఊపందుకోవడానికి ఇలా ప్లాట్ల కేటాయింపు అనేది కీలకంగా మారుతుందని అందరూ అంచనా వేస్తున్నారు.
సి ఆర్ డి ఏ కార్యాలయంలో నిర్వహించే ఈ లాటరీ విధానంలో 20 గ్రామాలకు చెందిన 129 మంది రైతులకు ప్లాట్ల కేటాయింపు జరుగుతుంది. మొత్తం 319 ప్లాట్లను వీరికి కేటాయించనున్నారు.
ఒకవైపు అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు కు సంబంధించిన పనులు కూడా వేగంగా అవుతున్నాయి. ఒకసారి ఔటర్ రింగ్ రోడ్డు మార్కింగ్ పూర్తయి పునాదులు పడితే గనుక ఆ లోపలి ప్రాంతం మొత్తం నిర్మాణ పనులతో కళకళలాడుతుందనే అభిప్రాయం పలువురిలో ఉంది. ఇప్పుడు రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు కూడా కేటాయించడం జరిగితే ఆ జోరుకు మరింత జత అవుతుంది.