ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు సరికొత్త నినాదంతో సిద్ధమవుతున్నారు. ఆయన నినాదం ఏపీలోని యువతరానికి కొత్త ఉత్సాహం అందించే విధంగా ఉంది. కొత్త స్ఫూర్తిని అందిస్తోంది. ఆహా ఓటీటీ ప్లాట్ఫారం కోసం నందమూరి బాలకృష్ణ తో చేసిన అన్ స్టాపబుల్ కార్యక్రమ ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు అనేక కీలక విషయాలను వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఎన్ని సీక్రెట్ లు ఆ ఇంటర్వ్యూలో బయటకు వస్తాయో త్వరలోనే తెలుస్తుంది. తాజాగా విడుదలైన ప్రోమోలో మాత్రం చంద్రబాబు కొత్త నినాదం తెలుగుజాతికి ఆశా కిరణం లాగా కనిపిస్తోంది. థింక్ గ్లోబల్ యాక్ట్ గ్లోబల్ అనేది తన తాజా నినాదంగా పరిపాలనను డిజైన్ చేసుకుంటున్నట్లుగా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
ఒకప్పట్లో ‘థింక్ గ్లోబల్ యాక్ట్ లోకల్’ అనేది తన నినాదంగా ఉండేదని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. కానీ మారుతున్న పరిస్థితులలో ‘యాక్ట్ గ్లోబల్’ అనేది కూడా ముఖ్యమని.. ఏదో ఒక నాటికి ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ వన్ గా ఎదగాలన్నదే తన ఆకాంక్ష అని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాజమండ్రి జైల్లో ఉన్నప్పటి సంగతులను గురించి బాలకృష్ణ ప్రస్తావించగా చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి గురయ్యారు. అలాగే రాజమండ్రి జైలుకు వచ్చిన పవన్ కళ్యాణ్ తో భేటీ గురించి అడిగినప్పుడు ‘‘రెండు నిమిషాలు నేను పవన్ మాట్లాడుకున్నాం.. ఒక నూతన చరిత్ర రాయడానికి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నాం’’ అని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి పతనాన్ని శాసించిన పొత్తు రాజకీయాల గురించి ఆయన అన్యాపదేశంగా తెలియజేశారు.
నేను మాస్ హీరో అయితే మీరు మాస్ లీడర్ అని బాలకృష్ణ ప్రస్తావించినప్పుడు చంద్రబాబు నాయుడు బాలయ్య పాపులర్ డైలాగును రిపీట్ చేస్తూ ‘‘బోత్ ఆర్ నాట్ ది సేమ్’’ అంటూ చిరునవ్వుతో విజయకేతనం చూపించడం కార్యకర్తలకు కిర్రెక్కిస్తోంది. మొత్తానికి చంద్రబాబు నాయుడు అన్ స్టాపబుల్ ఇంటర్వ్యూ కోసం ఏపీ ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు.