వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అధికారం అండ చూసుకుని ఆ పార్టీ నాయకులు ఎంతెంత విచ్చలవిడిగా చెలరేగిపోతూ వచ్చారనడానికి అనేక ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. ఇలాంటి వాటిలో.. దళితుడైన తన డ్రైవరును, ఎంతోకాలంగా నమ్మకస్తుడిగా ఉంటున్న అనుచరుడిని హత్యచేసి, అర్ధరాత్రివేళ వాళ్ల ఇంటికి డోర్ డెలివరీ చేసిన అనంతబాబు ఎపిసోడ్ ఒక హైలైట్. ఇప్పుడు ఎంతో నమ్మకస్తులైన తన స్నేహితుడు, అనుచరుడు అయిన దళిత యువకుడు.. తమ ప్రభుత్వం ఏర్పాటులోనే వాలంటీరుగా సేవలందిస్తున్న దుర్గాప్రసాద్ అనే వ్యక్తిని హత్య చేయించి, అసలు మృతదేహమే కనిపించకుండా చేసిన పినిపే శ్రీకాంత్ వ్యవహారం కూడా అచ్చంగా అనంతబాబు ఎపిసోడ్ మాదిరిగానే కనిపిస్తోంది.
అనంత బాబు చాలా సహృదయంతో తాను చంపిన డ్రైవరును వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేశాడు. పినిపె శ్రీకాంత్ తాను అంతకంటే గొప్ప సహోదరుడిని అని నిరూపించుకోవడానికి తాను చంపించిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి ఆదుకోవడం విశేషం. పినిపే శ్రీకాంత్ అరెస్టు తరువాత ఈ హత్య వెనుక గల చాలా విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
కోనసీమ అల్లర్ల సమయంలో జరిగిన ఈ హత్యకు సంబంధించి కేసును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హతుడి కుటుంబం- మంత్రి వాసంశెట్టి సుభాష్ ను ఆశ్రయించడంతో ఆయన డిఐజి వద్దకు తీసుకువెళ్లి ఆమెకు న్యాయం చేయించాల్సిందిగా కోరారు. కేసును పోలీసులు తిరగతోడిన తర్వాత పినిపే శ్రీకాంత్ పాత్ర బయటకు వచ్చింది. మాజీ మంత్రి విశ్వరూప్ తదితరులంతా వాసంశెట్టి సుభాష్ ఉద్దేశపూర్వకంగా తన కొడుకుని ఇరికించడానికి ఈ కుట్ర చేశారని చవకబారు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాసంశెట్టి సుభాష్ మరికొన్ని కొత్త సంగతులను బయటపెడుతున్నారు.
తన ప్రధాన అనుచరులలో ఒకడైన దుర్గాప్రసాద్‌ను పిన్నిపె శ్రీకాంత్ హత్య చేయించిన తర్వాత.. బాధిత కుటుంబానికి లక్ష రూపాయల సాయం చేశాడని చెబుతున్నారు. అలాగే అతడు దుర్గాప్రసాద్ భార్య శ్రావణ సంధ్యను జిల్లా ఎస్పీ కార్యాలయానికి తీసుకువెళ్లి రెండు ఎకరాల పొలం ఇప్పిస్తామని కేసు పెట్టవద్దని సలహా ఇస్తూ పెద్ద మనసు చూపించినట్లుగా కూడా సుభాష్ బయటపెట్టారు.
విచారణలో పూర్తి వాస్తవాలు తెలుస్తాయని, చట్టం తన పని తాను చేసుకు పోతుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అంటున్నారు. వైసీపీ హయాంలో తొలుత మిస్సింగ్ కేసుగా నమోదు, తర్వాత హత్య కేసుగా మారిన ఈ వ్యవహారాన్ని ఎందుకు క్లోజ్ చేసారో కూడా చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. చూడబోతే ఈ హత్య వ్యవహారం పినిపె విశ్వరూప్ రాజకీయ జీవితానికి సమాధి కట్టే లాగానే కనిపిస్తోంది. అనంత బాబుకు శ్రీకాంత్ కు ఒక్కటే తేడా. ఆ కేసులో హతుడు మాత్రమే దళితుడు. ఈ కేసులో హత్య చేయించిన వాడు కూడా దళితుడే అని ప్రజలు అనుకుంటున్నారు.