మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నిజంగా తనకు ప్రజాబలం ఉన్నదనే విశ్వాసం ఉంటే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఇప్పటికే వ్యతిరేకత వచ్చేసిందనే నమ్మకం ఉంటే రాబోయే పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో నిరూపించుకోవాలని రాజకీయ వర్గాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధించడం అనేది కేవలం ఈవీఎంలలో జరిగిన మాయ అని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఎన్నిసార్లు ఆరోపించారో లెక్కేలేదు. బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు జరగాలని ఉద్యమానికి దేశవ్యాప్తంగా తాను సారథ్యం వహిస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారు.
బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నిక జరిగి ఉంటే తన పార్టీ గెలిచి ఉండేదని ఆయన పదేపదే చెప్పారు. ఆ విషయం ప్రగల్భాలు కాదని నిజమేనని నిరూపించుకోవడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక అద్భుతమైన అవకాశం కలిసి వచ్చింది. రాష్ట్రంలో కీలకమైన నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే జరగబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే ఈ ఎన్నికల్లో తన పార్టీని గెలిపించుకుని, సత్తా నిరూపించుకుని తాను చెబుతున్న మాట వాస్తవమేనని.. కేవలం ఈవీఎంల మాయ, మోసం ద్వారానే చంద్రబాబు నాయుడు గెలిచాడని చాటి చెప్పుకోవచ్చునని రాజకీయ వర్గాల్లో సవాళ్లు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో కృష్ణ-గుంటూరు మరియు ఉభయ గోదావరి జిల్లాల్లో రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. ఇవి బ్యాలెట్ పేపర్ విధానంలోనే జరుగుతాయి. ఏ విధానాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి పదేపదే కోరుకుంటున్నారో.. అదే పద్ధతిలో జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా జగన్మోహన్ రెడ్డి ఇంకా అంత కసరత్తు పూర్తి చేయలేదు. ఈ ఎన్నికలలో అభ్యర్థులను మోహరించి ఘన విజయం సాధిస్తే కనుక ప్రజలు కచ్చితంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్షానే ఉన్నారు గానీ, చంద్రబాబు నాయుడు ఈవీఎంల మాయ ద్వారా గెలిచాడనే ఆరోపణలకు మరింత బలం వస్తుంది. జగన్ తన మాటలు నిజమేనని తన ఆరోపణలు సహేతుకమైనవని నిరూపించుకోవాలంటే.. ఈ ఎన్నికలలో నెగ్గడం చాలా కీలకం! బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగే ఎన్నికలను సద్వినియోగం చేసుకుంటేనే ఆయన వాదన నిలబడుతుందని ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. మరి జగన్ ఈ సదవకాశాన్ని ఎంత మేరకు వాడుకుంటారో వేచి చూడాలి.